వెన్నెల విభావరి


పున్నమి వెన్నెల పులకింతల జాబిలి,

మనసును తాకిన మధురమైన వేళలో,

మమతలు మొలిచిన మల్లెల తోటలో,

పూలపై జారిన పరిమళాల వెల్లువగు॥


కమ్మని వెన్నెల కోరికలకు ఊపిరై,

నిశిలో నెమ్మదిగా నినదించే రాగమై,

నీరవ హృదయాలలో నిలిచిపోయె గీతమై,

కలువల కనులలో కాంతుల నిగ్గుయగు॥


చల్లని వెన్నెల చిగురాకుల నాట్యమై,

అలసిన బ్రతుకులకు ఆత్మీయ హస్తమై,

అందమైన అనుభూతి అమృతధారయై,

చిరుగాలితో కలిసి చిందులేసె గానమగు॥


తెల్లని వెన్నెల తెరచాపై పరచుకొని,

నిర్మల ప్రేమకు నిలువెత్తు రూపమై,

నింగినుంచి దిగివచ్చె నిత్యానురాగమై,

తేనెలా తీయని తలపులకు తావగు॥


కార్తీక వెన్నెల కాంతులై విరజిల్లి,

భక్తి భావనలను భువిలో పరిమళింపజేసి,

భవ్యమైన దైవత్వం హృదయాలలో నింపి,

కోటి దీపాలతో కలసి వెలుగుల జల్లగు॥


పిండి వెన్నెల పల్లెలన్ని పరవశింపజేసి,

వెండి వన్నెలతో వెలుగుల ముగ్గులేసి,

వేకువ దాకా వింత మాయలు చేసి,

పంటచేలపై పసిడి కలల కుమ్మరింపగు॥


మురిపించే వెన్నెల ముద్దులు కురిపించి,

ప్రేయసి నవ్వులా ప్రేమలను పంచి,

ప్రతి క్షణమూ పరవశ గీతమై నిలిచి,

మల్లెల సుగంధాలతో మనసులో నిండగు॥


మైమరిపించే వెన్నెల మధురిమగా మారి,

ప్రేమికుల హృదయాలలో ప్రణయదీపమై,

ప్రపంచమంతటా పరిమళించె ప్రకాశమై,

మౌనాల మాటలకు మంజీర నాదమగు॥


— గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం. 



Comments

Popular posts from this blog