కవిగారి కలం
కవిగారి కలం
అక్షరాలు కక్కుతుంది —
ఆత్మలో అలజడి రేపిన అనుభూతులను
అమృతబిందువులుగా జాలువారిస్తుంది॥
కవిగారి కలం
ఆలోచనలకు రూపమిస్తుంది —
ఆకాశంలో విహరించే ఊహలకు
అందమైన రెక్కలు తొడిగిస్తుంది॥
కవిగారి కలం
అందాలు చూపుతుంది —
పూల నవ్వుల్లో పరిమళాలను,
వెన్నెల వెలుగుల్లో వలపులను దర్శింపజేస్తుంది॥
కవిగారి కలం
ఆనందాలు పంచుతుంది —
అలసిన హృదయాల ముంగిట
ఆశల హరివిల్లును విరియజేస్తుంది॥
కవిగారి కలం
అనుభవాలు చెబుతుంది —
కాలం నేర్పిన పాఠాలను
కన్నీటి చుక్కల్లోనూ చదివిస్తుంది॥
కవిగారి కలం
ఆతృత కలిగిస్తుంది —
తరువాయి పంక్తిలో ఏముందోనని
పాఠక హృదయాలను పరవశింపజేస్తుంది॥
కవిగారి కలం
అంతరంగాలు తడుతుంది —
మౌనంగా దాచుకున్న మమకారాలను
మృదువైన స్పర్శతో మేల్కొలుపుతుంది॥
కవిగారి కలం
ప్రేమకు పల్లకీ అవుతుంది,
వేదనకు వేదిక అవుతుంది,
విజయానికి వందనం చేస్తుంది,
పరాజయానికి పరామర్శ అవుతుంది॥
కవిగారి కలం
సమాజానికి దర్పణమవుతుంది,
సత్యానికి సాక్ష్యమవుతుంది,
మానవత్వానికి మకుటమవుతుంది,
మంచితనానికి మార్గదర్శి అవుతుంది॥
కవిగారి కలం —
పిలుస్తుంది, ప్రేమిస్తుంది,
హృదయాన్ని హృదయంతో కలిపే
అమృతాక్షరాల యజ్ఞం చేస్తుంది॥
కవిగారి కలం — కదులుతుంది — కదిలిస్తుంది,
ఆడిస్తుంది — పాడిస్తుంది,
మరిపిస్తుంది — మురిపిస్తుంది,
మనసులను మమతలతో ముంచెత్తిస్తుంది॥
కవిగారి కలం —
కాలాన్ని దాటి ప్రయాణిస్తుంది,
కవి మరుగున పడినా
కవిత్వాన్ని చిరంజీవిగా నిలుపుతుంది॥
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

Comments
Post a Comment