తెలుగు... నా సర్వస్వం
తెలుగు ప్రాణమై —
పుట్టుకలో తొలి ఏడుపై పలికిన స్వరమై,
అమ్మ ఒడిలో ఆలపించిన జోలపాటై,
జీవితమంతా తోడుండే జీవనాడై నడిపిస్తుంది॥
తెలుగు గానమై —
కోయిల గొంతులో కులుకులాడే రాగమై,
గోదావరి అలలపై నర్తించే సంగీతమై,
మనసు వీణను మీటే మధురనాదమై మార్మోగుతుంది॥
తెలుగు ఊపిరై —
ఉదయగాలిలో ఉల్లాసంగా వీచే పరిమళమై,
ఉనికికి ఊతమిచ్చే ఆత్మస్పందనై,
అంతరంగమంతా నిండిపోయే అనురాగమై విహరిస్తుంది॥
తెలుగు రక్తమై —
నరనరాల్లో ప్రవహించే జాతి జ్ఞాపకమై,
త్యాగాల తేజాన్ని మోసుకొచ్చిన వారసత్వమై,
గుండెల లోతుల్లో గర్వస్పందనై నిత్యం జీవధారగా ప్రవహిస్తుంది॥
తెలుగు వెలుగై —
అక్షరదీపాల వెలుగులతో దారిచూపే జ్యోతియై,
అజ్ఞాన మేఘాలను చీల్చే అరుణోదయమై,
జ్ఞానాకాశంలో విరిసే సూర్యకిరణమై ప్రకాశిస్తుంది॥
తెలుగు మధురమై —
తేనెచుక్కల తియ్యదనాన్ని మించిన రుచియై,
మల్లెపూల సౌరభాన్ని మించిన మాధుర్యమై,
పలికిన ప్రతిసారీ హృదయాలను పరవశింపజేస్తుంది॥
తెలుగు మంత్రమై —
మనసులను ముడివేసే మమతాసూత్రమై,
మనుషులను దగ్గరచేసే మహిమాశక్తియై,
మానవత్వాన్ని మేల్కొలిపే మంగళనాదమై ప్రతిధ్వనిస్తుంది॥
తెలుగు వర్షమై —
ఎదలో ఎండిన భావభూమిని తడిపే జల్లులై,
ఆశల చిగురులను మొలిపించే అమృతధారలై,
ఆనందపు పంటలను పండించే వరదానమై కురుస్తుంది॥
తెలుగు కవితై —
భావాలకు భాష్యం చెప్పే భవ్యరూపమై,
హృదయానికి హత్తుకునే హంసగీతమై,
కాలాన్ని దాటి నిలిచే కళాసౌధమై విరాజిల్లుతుంది॥
తెలుగు తల్లియై —
అక్షరాలను అన్నముద్దలుగా తినిపించిన జననియై,
సంస్కారాలను సిరిసంపదలుగా పంచిన దైవమై,
తరతరాలను తీర్చిదిద్దే కల్పవల్లిగా నిలిచిపోతుంది॥
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

Comments
Post a Comment