నా కవితా నాయిక
నా కవిత వగలాడి —
వసంతవీచికలా వయ్యారంగా విహరిస్తూ,
మనసు మల్లెలను ముద్దాడుతూ,
మధురానుభూతుల మకరందం పంచుతుంది॥
నా కవిత సుందరి —
అక్షరాల ఆభరణాలను ధరించుతూ,
భావాల కాటుకను దిద్దుకొంటూ,
చదివిన హృదయాలను చూరగొంటుంది॥
నా కవిత చిలిపి —
చిరునవ్వుల చినుకులు చిమ్ముతూ,
పదాలతో దాగుడుమూతలు ఆడుతూ,
పాఠకుడి పెదవులపై నవ్వులు పూయిస్తుంది॥
నా కవిత చతురి —
జీవిత సత్యాలను జాలువారుస్తూ,
ఒక్క పంక్తిలోనే విశ్వార్థాలను నింపుతూ,
వివేకదీపాలను వసుధంతా వెలిగిస్తుంది॥
నా కవిత ప్రేరణి —
నిరాశల చీకటిని తరిమివేస్తూ,
అడుగులు తడబడిన వేళ చేయూతనిస్తూ,
ఆత్మవిశ్వాసపు రెక్కలు తొడిగిస్తుంది॥
నా కవిత కోమలి —
పూలరేకులంత సుకుమారమై,
మమతల పరిమళాలు వెదజల్లుతూ,
మనసులను మృదువుగా మైమరపిస్తుంది॥
నా కవిత కులుకులాడి —
సెలయేటి అలలవలె సవ్వడులు చేస్తూ,
రాగాల ఊయలలో ఊగుతూ,
రసహృదయాలను రంజింపజేస్తుంది॥
నా కవిత సరసి —
సరస సంభాషణలను సాగిస్తూ,
ప్రేమపల్లవాలను పరచుతూ,
హృదయవీణలను మీటుతుంది॥
నా కవిత సాహసి —
అన్యాయాన్ని నిలదీస్తూ,
సత్యపతాకను ఎగురవేస్తూ,
సమాజానికి దిశానిర్దేశం చేస్తుంది॥
నా కవిత సాధ్వి —
సంస్కారాల సుగంధం నింపుతూ,
ధర్మమార్గాన్ని చూపిస్తూ,
మానవత్వాన్ని మేల్కొల్పుతుంది॥
నా కవిత సహనశీలి —
కష్టాల కడలిని దాటించుతూ,
బాధల భారాన్ని భరిస్తూ,
ఆశాకిరణాలను ప్రసరిస్తుంది॥
నా కవిత సహచరి —
నా ప్రతి శ్వాసలో కొలువుంటూ,
కన్నీటి వేళ ఓదారుస్తూ,
ఆనందవేళ హర్షగీతమై తోడుంటుంది॥
నా కవిత —
అక్షరాల అందాలరాశి,
భావాల పారిజాతి,
హృదయానికి హారతి॥
నా కవిత —
పూర్తిగా చదవమంటుంది,
ఆద్యంతం ఆస్వాదించమంటుంది,
మదిలో చిరకాలం మెదలమంటుంది॥
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

Comments
Post a Comment