ఎల్‌నినో కాలమొస్తుందట!


ఎల్‌నినో కాలం వస్తుందట - 

ఎవ్వరినీ వదలదట,

ఎల్ల జీవుల గుండెల్లో

ఎన్నో ఆందోళనలు రేపుతుందట॥


ఎల్‌నినో కాలమటరా —

ఎండల ఎగసే గడ్డుకాలమటరా,

భూమాత గుండె పగిలే

బాధల కాలమటరా॥


వానలు వెనుకడుగు వేసే

కరువుల కాలమటరా,

చెరువులు చెమ్మ కోల్పోయే

కొరతల కాలమటరా॥


పంటలు పచ్చదనం కోల్పోయే

కష్టాల కాలమటరా,

రైతన్న కళ్లలో ఆశలు ఆరే

వేదనల కాలమటరా॥


నదులు నీరులేక నిట్టూర్చే

సంక్షోభాల కాలమటరా,

పశుపక్ష్యాదులు దాహంతో

పరితపించే కాలమటరా॥


బావులు అడుగంటిపోయే

భయాల కాలమటరా,

ప్రతి నీటి బొట్టును

పొదుపుగా దాచాల్సిన కాలమటరా॥


పస్తులు పొంచి చూసే

బతుకులు భారమయ్యే కాలమటరా,

వృథా ఖర్చులకు దూరమై

వివేకం చూపాల్సిన కాలమటరా॥


అందుకే సోదరులారా!

నీటిని నిధిలా కాపాడుదాం,

చెట్టును ప్రాణంలా పెంచుదాం,

ప్రకృతిని ప్రేమగా ఆదరించుదాం॥


ఎల్‌నినో ప్రభావమొచ్చినా —

ఐకమత్యంతో ఎదుర్కొందాం,

అవగాహనను  ఆయుధంగా చేసుకొని,

ఆపదలను అధిగమిద్దాం॥


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం. 


Comments

Popular posts from this blog