కలం పట్టాడు...


కలం పట్టాడు... కలలు కంటున్నాడు —

కన్నుల ఆశల దీపాలు వెలిగిస్తున్నాడు,

రేపటి విజయాలకు బాటలు వేస్తున్నాడు,

కనిపించని శిఖరాలను చేరాలని సాగుతున్నాడు॥


కలం పట్టాడు... కల్పనలు చేస్తున్నాడు —

కొత్తలోకాలకు రూపురేఖలు దిద్దుతున్నాడు,

ఆలోచనల ఆకాశంలో విహంగమై విహరిస్తున్నాడు,

అద్భుత సృష్టులకు బీజాలు వేస్తున్నాడు॥


కలం పట్టాడు... కాగితాలపై గీస్తున్నాడు —

గీతల్లో గుండెచప్పుళ్లను దాచుతున్నాడు,

రంగుల్లో రాగాలసౌందర్యాన్ని నింపుతున్నాడు;

కలకాలం నిలిచే కళాఖండాలను సృష్టిస్తున్నాడు॥


కలం పట్టాడు... కమ్మగా రాస్తున్నాడు —

మధురమైన మాటలతో మురిపిస్తున్నాడు,

అక్షరాలహారాలతో అనుభూతులను అలంకరిస్తున్నాడు;

చదివే హృదయాల్లో చిరునవ్వులు పూయిస్తున్నాడు॥


కలం పట్టాడు... కష్టపడుతున్నాడు —

కలాన్ని కత్తిలా పదునుపెట్టి సాగుతున్నాడు,

కన్నీటి చుక్కలను సిరాగా మార్చుతున్నాడు,

కవితల పంటలు పండిస్తున్నాడు॥


కలం పట్టాడు... కంఠం విప్పుతున్నాడు —

కనిపించని బాధలకు స్వరమై నిలుస్తున్నాడు,

కట్టుబాట్ల సంకెళ్లను తెంచాలనిచూస్తున్నాడు,

కాలాన్నే కసిదీరా ప్రశ్నిస్తున్నాడు॥


కలం పట్టాడు... కుతూహల పరుస్తున్నాడు —

కొత్త ఆలోచనల విత్తనాలు నాటుతున్నాడు,

కదలని మనసుల్లోనూ చైతన్యం రగిలిస్తున్నాడు,

కాంతుల చిగుర్లు తొడిగిస్తున్నాడు॥


కలం పట్టాడు... కడుపులు నింపుతున్నాడు —

కర్షకుడై నేలను ప్రేమిస్తున్నాడు,

కార్మికుడై చెమటను చిందిస్తున్నాడు,

కళాకారుడై జీవితానికి రంగులు అద్దుతున్నాడు॥


కలం పట్టాడు... కలం కదిలిస్తున్నాడు — 

అక్షరాలు అల్లుతున్నాడు,

కలలను సాకారం చేస్తున్నాడు,

కర్తవ్యాన్ని భుజాన మోస్తున్నాడు,

కాలగమనానికే దిక్సూచిగా నిలుస్తున్నాడు॥


కలం పట్టాడు — కవిగా భావాలను పంచుతున్నాడు,

కర్షకుడై అన్నాన్ని పండిస్తున్నాడు, 

కార్మికుడై ప్రపంచాన్ని నిర్మిస్తున్నాడు,

కలంతోనే సమాజానికి కొత్త దారులు చూపిస్తున్నాడు,

కాలానికి మార్గదర్శిగా వెలుగొందుతున్నాడు॥


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం. 


Comments

Popular posts from this blog