ఓ నవయువకుడా... ఏ రంగం నీ రణరంగం?


రంగస్థలం ఎక్కుతావా —

రసరంజిత పాత్రలతో హృదయాలను గెలుచుకుంటావా?

నటనను నందనవనమై వికసింపజేసి,

చప్పట్ల సంద్రంలో చిరునవ్వులు పూయిస్తావా?


సేవారంగంలోకి దిగుతావా —

సాటిమనిషి కన్నీటిని తుడిచే దివ్యహస్తమవుతావా?

బాధల బాటలో దీపమై వెలిగుతూ,

మానవత్వ పరిమళాలను వెదజల్లుతావా?


రాజకీయాల్లోకి ప్రవేశిస్తావా —

ప్రజల ఆశలకు ప్రతినిధిగా నిలుస్తావా?

అధికారాన్ని అలంకారంగా కాక,

అభ్యుదయానికి ఆయుధంగా మలుచుకుంటావా?


సంపాదనకు పూనుకుంటావా —

సంకల్పాలకు విజయశిఖరాలు కట్టుకుంటావా?

ధనాన్ని కూడబెట్టడమే కాదు,

ధర్మానికి దానిని దిక్సూచిగా చేస్తావా?


దేశరక్షణకు శ్రమిస్తావా —

సరిహద్దుల సింహంలా సాహసకార్యాలు చేస్తావా?

మాతృభూమి ముద్దుబిడ్డవై,

త్యాగధనుడిగా చరిత్రలో నిలుస్తావా?


పత్రికారంగంలోకి అడుగిడుతావా —

నిజాలను నిష్పక్షపాతంగా జగతికి వినిపిస్తావా?

కలాన్ని కత్తిలా పదునుపెట్టి,

సమాజానికి సత్యదర్పణమవుతావా?


వ్యాపారంలోకి దుముకుతావా —

వినూత్న వరవడులకు విజయబాటలు వేస్తావా?

ఉపాధి అవకాశాల ఊటలై,

ఎందరికో భవిష్యత్తును నిర్మిస్తావా?


సాహిత్యంలో సంచలనాలు సృష్టిస్తావా —

అక్షరాలతో ఆలోచనల విశ్వాన్ని ఆవిష్కరిస్తావా?

భావాలను భాస్వర కిరణాలుగా మార్చి,

తరతరాలకు మార్గదర్శకుడవుతావా?


ఏ రంగం ఎంచుకున్నా సరే —

ఎత్తుకు ఎదగడం లక్ష్యమవ్వాలిరా!

ఏ దారిలో నడిచినా సరే —

మానవతా విలువలే మార్గమవ్వాలిరా!


పేరు కోసం కాదు, పరమార్థం కోసమురా,

పదవి కోసం కాదు, ప్రజాహితం కోసమురా!

నీ ప్రతిభకు తగిన రంగాన్ని ఎంచుకొని,

భారతదేశ భవితకు వెలుగుదీపమవ్వరా!


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.


Comments