తలమానికం
తల ఎక్కడ పెట్టుకుంటావ్? అని కాలం ప్రశ్నిస్తుంటే,
తలెత్తి నిలబడతా ధైర్యానికి చిరునామాగా;
తల దాచుకుంటావా? అని అపజయం వెక్కిరిస్తుంటే,
తలవంచక ముందుకు సాగుతా విజయ పథముగా॥
తల దోచుకుంటావా? అని చింతలు చుట్టుముడితే,
తలలోని తలంపులతో పరిష్కారాలు వెదుకుతా;
తల గీసుకుంటావా? అని కష్టాలు కవ్విస్తుంటే,
తపనతో శ్రమించి శిఖరాలను చేరుకుంటా॥
తల పోసుకుంటావా? అని సంబరాలు పిలుస్తుంటే,
సంతోష జలధారలో మనసును తడుపుకుంటా;
తల దన్నుతావా? అని కష్టాలు కమ్ముకొచ్చినా,
తట్టుకొని నిలిచి జీవిత పాఠాలు నేర్చుకుంటా॥
తల ఎక్కి కూచుంటావా? అని అహంకారం రమ్మంటే,
తలవంచే వినయాన్నే తలమానికంగా ధరించుకుంటా;
తల దువ్వుతావా? అని ఉదయం పలకరించినపుడు,
ఆశల పూలదండను అందంగా అల్లుకుంటా॥
తల తిప్పుతావా? అని అన్యాయం ఎదురైనపుడు,
తప్పును చూసి మౌనంగా పక్కకు తప్పుకోను;
తలలో దూరుతావా? అని సందేహాలు చేరినపుడు,
సత్య దీపముతో చీకట్లను తరిమివేస్తా॥
తల నరుకుతావా? అని కోపం కత్తి దూస్తుంటే,
క్రోధాన్ని నరికేసి కరుణను పెంచుకుంటా;
మనిషి తలను కాదు చెడు తలంపులను తొలగించి,
మానవతా మార్గంలో మమతలు నాటుకుంటా॥
తల పగలకొడతావా? అని పగ ప్రతీకారం రెచ్చగొడితే,
రాళ్లను కాదు అజ్ఞాన గోడలను బద్దలుకొడతా;
మనసుల మధ్య పెరిగిన అపార్థాల కంచెలను చెరిపి,
స్నేహసేతువులను నిర్మించి ప్రేమను పంచుతా॥
తలకు టోపీ పెడతావా? అని మోసాలు ముసురుకొస్తే,
మేధస్సు దీపముతో మాయముఖాలను గుర్తిస్తా॥
తల అనే పదములో ఎన్నెన్నో భావాలు దాగియున్నా,
తలమానికమైన మంచితనమే మనిషికి మహాభూషణమంటా॥
తల ఉన్నంతవరకు తలపులు పుడుతూనే ఉంటాయి,
తలపులు ఉన్నంతవరకు కలలు వికసిస్తాయి;
తలమానికమైన సద్భావనలు మనసున నిండినపుడే,
మనిషి జీవితం పరిమళించే పుష్పవనమవుతుంది॥
తలలో మంచి తలంపులుంటేనే తలమానికమౌతుంది జీవితం,
తలెత్తుకొని నడిచే గౌరవానికి అది చిరునామా;
తల అనేది శరీరానికే శిఖరమైతే,
మంచి తలంపులే జీవితానికి తలమానికమవుతాయి॥
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

Comments
Post a Comment