అక్షరహారం 


పూలదండ —

పరిమళాల పండుగ,

రంగుల రాగాలతో

రమ్యంగా నవ్వే ప్రకృతి హారం॥


ముత్యాలసరము —

సముద్రగర్భపు సౌందర్యం,

చంద్రకాంతుల చినుకులను

చేరదీసిన చక్కని అలంకారం॥


బంగారుహారము —

విలువల వెలుగు,

వైభవ వైభోగాలకు

వన్నె తెచ్చే వర్ణహారం॥


వెండిగొలుసు —

వెన్నెల తీగ,

మెడపై జారే

మృదువైన చల్లని కాంతిధార॥


కాసులపేరు —

సంపదల సవ్వడి,

పూర్వీకుల సంస్కృతిని

పదిలపరిచిన సంప్రదాయహారం॥


అక్షరమాల —

అమ్మ ఒడిలో నేర్చుకున్న

అనుభవాల తొలి మెట్టు,

జ్ఞానదీపాలు వెలిగించే దివ్యమాల॥


పదాలమాలిక —

భావాలకు భాష్యం,

మనసులో మొలిచిన కలలకు

మధురరూపం ఇచ్చే మణిహారం॥


జీవితదామము —

అనుభవాల పుష్పవనం,

ఆనంద–విషాదాల పువ్వులను

అల్లిన అదృశ్యహారం॥


పూలదండ పరిమళం కరిగిపోవచ్చు,

ముత్యాలసరపు మెరుపు మసకబారవచ్చు,

బంగారు–వెండి హారాలు రూపాలు మార్చుకోవచ్చు॥

అక్షరమాల అమరమవుతుంది, పదాలమాల పరిమళిస్తుంది॥


అక్షరమాల అందమైన కూర్పు,

పదాలమాలిక సొగసైన పేర్పు,

మెడను అలంకరించే హారాలకన్నా,

మనసును అలంకరించే అక్షరహారమే మిన్న॥


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం. 


Comments

Popular posts from this blog