మరదలి ముచ్చట్లు


కొంటెదానివంటే కోపపడతది —

కనుబొమ్మలు ముడిచేసి కసురుకుంటది;

చిలిపిదానివంటే చికాకుపడతది —

చిరాకు చూపులతో చుట్టుముడతది॥


ముదురువంటే మొండికేస్తది —

మాటకు మాటగా మల్లయుద్ధమాడతది;

శూర్పణఖవంటే శాపాలుపెడతది —

శబ్దాల బాణాలతో శరవర్షం కురిపిస్తది॥


రాకాసివంటే రంకెలేస్తది —

రగిలిన రవ్వలా రౌద్రం చూపిస్తది;

గయ్యాళివంటే గలభా చేస్తది —

గడియంతా గగ్గోలు గుప్పిస్తది॥


చుప్పనాతివంటే సురసురలాడుతది —

చెంపలు గిల్లుతూ చిలిపిగా చురకలేస్తది;

బండరాయివంటే బూతులందుకుంటది —

బాధనంతా బాహాటంగా వెల్లగక్కుతది॥


ముద్దుగుమ్మవంటే మురిసిపోతది —

ముసిముసి నవ్వులతో మెరిసిపోతది;

చక్కనిచుక్కవంటే చిరునవ్వు చిందిస్తది —

చెలిమి చల్లదనంతో చెంతకొస్తది॥


పొగడ్తంటే పూలవాన కురిపిస్తది —

పలుకుల్లో పరిమళాలు పంచుతది;

గౌరవమంటే గుండె గుమ్మం తెరుస్తది —

గారాబమంతా గుప్పెడు గుప్పెడుగా ఇస్తది॥


మాటలో మాధుర్యముంటే మనసే ఇస్తది —

మర్యాదలో మమతుంటే మమేకమవుతది;

స్త్రీహృదయం గెలవాలంటే ఇదే మంత్రమురా —

ప్రేమతో పలికిన పలుకే పరమాయుధమురా॥


విరసాలన్నీ వెలుపలే... లోపలంతా మమతలే,

వెక్కిరింపుల వెనకాల వెన్నెలలాంటి అనుబంధమే;

మరదలి సరసాలే బావలకు నవ్వుల పండుగ,

మాటల్లో చిలిపితనమే... మనసుల్లో మాత్రం ఆత్మీయతే॥


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.


Comments

Popular posts from this blog