పొద్దున్నే కవిత...


వెన్నుతట్టి లేపుతుంది —

వెలుగుబాటలో అడుగులు వేయమంటుంది,

వేకువవెలుగు వీణను మీటమంటుంది,

విజయగీతాలు ఆలపించమంటుంది॥


కన్నుగీటి కవ్విస్తుంది —

కలల గూటిని తెరిచి ఎగరమంటుంది,

కల్పనల రెక్కలు తొడగమంటుంది,

కవితాకాశంలో విహరించమంటుంది॥


పెన్నునిచ్చి రాయమంటుంది —

పదాలను పరిమళ పూలుగా పేర్చమంటుంది,

భావాలను బంగారు బాటలుగా మార్చమంటుంది,

భువనమంతా పరిమళింపజేయమంటుంది॥


మిన్నువైపు చూడమంటుంది —

మెరిసే శిఖరాలే నీ చిరునామా అంటుంది,

మేధస్సును మిణుగురుకన్నా 

మిన్నుగా వెలిగించమంటుంది॥


తన్నుతలచి ఆలోచనలు పారించమంటుంది —

మనసును మడుగులో నిలవనీయకు అంటుంది,

భావప్రవాహాలను గంగవలె ప్రవహింపజేయమంటుంది,

భావి తరాల దాహం తీర్చమంటుంది॥


బన్నులా ఫలహారం అందివ్వమంటుంది —

మధురమైన మాటల మామిడిపండ్లు పంచమంటుంది,

రసాల రుచుల్లా రసభరిత కవితలల్లమంటుంది.

పాఠక హృదయాలను పులకింపజేయమంటుంది॥


టన్నులకొద్దీ అక్షరాలను పేర్చమంటుంది —

అలసటను అక్షరాల అంచున వదిలేయమంటుంది,

అక్షరసేనలను సమీకరించమంటుంది,

అమృతకావ్యాలకు శ్రీకారం చుట్టమంటుంది॥


గన్నులా పదాలను పేల్చమంటుంది —

అన్యాయాల గోడలను కూల్చమంటుంది,

నిజాల నిప్పుకణాలను చిమ్మమంటుంది,

సమాజాన్ని మేల్కొలిపే శంఖమవ్వమంటుంది॥


నన్ను అన్నుల మిన్న చేయమంటుంది —

అహంకారంతో కాదు, అక్షర వైభవంతో;

పదవులతో కాదు, పదాల పరిమళంతో;

ప్రతిభతో ప్రజలహృదయాల్లో ప్రత్యేకస్థానం సంపాదించమంటుంది॥


నన్ను సాహిత్యంలో చిరంజీవి కమ్మంటుంది —

కాలం చెరపలేని కలంగా నిలవమంటుంది,

తరాలు చదివే తారకగా మెరవమంటుంది,

సాహిత్యాకాశంలో ధ్రువతారగా నిలిచిపొమ్మంటుంది॥


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం. 


Comments

Popular posts from this blog