ఏమైనా? ఏదైనా? 


భారమైనా — బాధ్యతను భుజాన మోయాలి,

చెమట చిందించైనా విజయాల్ని అందుకోవాలి;

దూరమైనా — దారిని విడవక ముందుకుసాగాలి,

గమ్యం ఎంత దూరమైనా చేరుకోవాలి! 


శరమైనా — సాహసంతో ఎదుర్కోవాలి,

గాయం తగిలినా త్వరగా మాన్పుకోవాలి;

సరమైనా — టక్కున అందిపుచ్చుకోవాలి,

శత్రువైనా — మెడలో చక్కగా అలంకరించాలి!


కారమైనా — చిరునవ్వుతో స్వీకరించాలి,

చేదు తగిలినా ఆరగించి ఆనందించాలి;

క్షీరమైనా — కృతజ్ఞతతో అంగీకరించాలి, 

జీవితాన్ని అమృతధారలా పారించాలి!


క్రూరమైనా — కఠినతను కరుణగా మార్చాలి,

క్షమాజలంతో కక్షల నిప్పును ఆర్పాలి;

నేరమైనా — నిజాయితీగా ఒప్పుకోవాలి,

చేసిన తప్పును చైతన్యంతో సరిదిద్దుకోవాలి!


తీరమైనా — కెరటాల కేరింత వినాలి,

తడిచి ఆనందసాగరంలో మునిగితేలాలి;

సారమైనా — అనుభవమే ఆలోచనలకు దారవాలి,

అక్షరాలు అమృతబిందువులై హృదయాల్లో జాలువారాలి!


ఏవి ఎదురైనా — వెనుకడుగు వేయకూడదు,

ఏది జరిగినా — ఆశను వీడకూడదు;

జీవితం ఇచ్చే ప్రతి అనుభవం — ఒక అక్షరమే,

ఆ అనుభూతులన్నీ కలిసినప్పుడే — మనిషి ఒక కావ్యమే!


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.


Comments

Popular posts from this blog