మౌన స్వరం
ఆకాశం క్రిందికి దిగా —
సూర్యకిరణాల్లో ప్రసరించా,
గాలి తెరల్లో పయనించా,
నదీ జలాల్లో ప్రవహించా!
చెట్ల నీడల్లో దూరా —
చల్లని ప్రాణమై నిలిచా,
రంగుల పువ్వులు పూయించా,
సుమాల సౌరభాలు వీయించా!
పక్షుల గానంలో పలికా —
పిల్లల నవ్వుల్లో మురిసా,
గుండె శ్వాసల్లోకి వెళ్లా,
కమ్మని గీతమై నిలిచా!
రణగొణ ధ్వనులు చేశా —
రాగాలై లోకాన్ని తాకా,
అలజడి మధ్యలో నడిచా,
అంతరంగాలను కదిలించా!
రహస్యంగా చెంతకు పిలిచా —
రాగద్వేషాల దూరం చేశా,
నిశ్శబ్దంలోకి శ్రోతలను
నెమ్మదిగా మళ్లించా!
ఎన్నుకున్న మాటలే చెప్పా —
ఎదలో ఎన్నో భావాలు పుట్టించా,
మాటలకు అందని సత్యాన్ని
మౌనంగా పరిచయం చేశా!
చివరికి నేనే మౌనమై —
మనసుల లోతుల్లో దాగి,
వినిపించని స్వరంగా మారి —
విశ్వమంతా పలికించా!
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

Comments
Post a Comment