జయ జయ దుర్గమ్మా!


జయ జయ దుర్గమ్మా — జయ జయ దుర్గమ్మా!

జగమంతా నిండిన జగజ్జననీ అమ్మా!

శరణన్న భక్తులకు అభయమిచ్చే అమ్మా,

శక్తిరూపిణివమ్మా — జయ జయ దుర్గమ్మా!  ||జయ|| 


సింహవాహినివై సాగివచ్చే అమ్మా,

శూలధారిణివై శత్రువులను సంహరించిన అమ్మా!

మహిషాసురుని మదమును అణచిన తల్లీ,

మంగళదాయినివై మమ్ము కాపాడు తల్లీ!


దుష్టశక్తులన్నీ దూరమగునమ్మా,

దుఃఖపు చీకట్లు తొలగిపోవునమ్మా,

“ధైర్యదీపమై మా గుండెల్లో వెలుగై,

దయతో చూడమ్మా — దుర్గమ్మా!           ||జయ|| 


అంబికవై అమ్మా అనురాగమివ్వమ్మా,

అన్నపూర్ణవై మా ఆకలి తీర్చమ్మా,

సరస్వతివై అమ్మా జ్ఞానమును పంచమ్మా;

లక్ష్మీరూపమై మా గృహాలను నింపమ్మా!


కన్నీటి బిందువులు కరుణతో తుడిచే అమ్మా,

కష్టాల కడలిని దాటించి నడిపే అమ్మా,

చిరునవ్వుల పూలను జీవితాన పూయించే అమ్మా,

చల్లని తల్లివై మమ్ము లాలించు అమ్మా!      ||జయ|| 


జయ జయ దుర్గమ్మా — జయ జయ దుర్గమ్మా!

జగమంతా నిండిన జగజ్జననీ అమ్మా!

శరణన్న భక్తులకు అభయమిచ్చే అమ్మా,

శక్తిరూపిణివమ్మా — జయ జయ దుర్గమ్మా!


నవరాత్రి వేళ నీ నామమే గానం తల్లీ,

నవదుర్గ రూపాలే మా హృదయ ధ్యానం తల్లీ,

కుంకుమ పువ్వులతో కొలిచే నీ పాదం తల్లీ

కోటిదీపాల వెలుగై నింపే మా లోకం తల్లీ!    ||జయ|| 

    

భక్తితో పిలిచితే పలికే తల్లివి నీవమ్మా,

బాధలలో తోడై నిలిచే దేవివి నీవమ్మా,

“అమ్మా” అని పిలిచే ప్రతి గొంతుకూ తల్లీ,

అభయహస్తమై నిలిచే ఆదిశక్తివి నీవమ్మా!


జయ జయ దుర్గమ్మా — జయ జయ దుర్గమ్మా!

జగమంతా నిండిన జగజ్జననీ అమ్మా!

శరణన్న భక్తులకు అభయమిచ్చే అమ్మా,

శక్తిరూపిణివమ్మా — జయ జయ దుర్గమ్మా!    ||జయ||     


అధర్మం అంతమై ధర్మం వెలుగాలి అమ్మా,

అన్యాయం తొలగి న్యాయం నిలవాలి అమ్మా,

ద్వేషాలు కరిగి ప్రేమలు వెల్లివిరియాలి అమ్మా,

ధరణిపై శాంతి సౌభాగ్యాలు నిండాలి అమ్మా!


మా ఇంట మంగళం — మా మనసున మంగళం,

మా మాటలో మాధుర్యం — మా బాటలో ధర్మం,

నీ కరుణ ఉంటే చాలు తల్లీ,

జీవితమంతా మాకు విజయదశమి తల్లీ!      ||జయ|| 


జయ జయ దుర్గమ్మా — జయ జయ దుర్గమ్మా!

జగజ్జననీ అమ్మా — జయ జయ దుర్గమ్మా!

శరణాగతులమైన నీ బిడ్డలమమ్మా,

శాశ్వతంగా కాపాడు — జయ జయ దుర్గమ్మా! ||జయ|| 


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.


Comments

Popular posts from this blog