Posts

Showing posts from November, 2026
Image
 సమాజమే ఒక దేవాలయం! సమాజమే ఒక దేవాలయం — సమష్టి జీవన సౌధం! సమాజ హితమే పరమావధి — సత్కార్యాలే సాధనం! సమాజ అభివృద్ధే కీలకం — సమైక్యతే ఆలంబనం! సమాజ సేవే అభిలషణీయం — మానవత్వమే ఆభరణం! మనుషులంతా ఒక్కటైతే — మహిలోనే స్వర్గసీమ! మనసులన్నీ కలిసికట్టుగా సాగితే — మమతలే చిరునామా! కులమతాల గోడలన్నీ కూలిపోవాలి — కలసిమెలసి సాగాలి! కలతలన్నీ తొలగిపోవాలి — కరుణామృతం కురవాలి! పేదల కన్నీరు తుడవాలి — వారి పెదవులపై నవ్వులు పూయించాలి! బడుగు బలహీనులను చేరదీయాలి — అండగా నిలవాలి! ఆకలితో అలమటించేవారికి అన్నదానం చేయాలి! ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తం అందించాలి! విద్యావెలుగులు పంచాలి — విజ్ఞాన దీపాలు వెలిగించాలి! వైద్యసేవలు అందించాలి — వేదనలను దూరం చేయాలి! పర్యావరణాన్ని కాపాడాలి — పచ్చదనాన్ని పెంచాలి! ప్రకృతి సంపదను పదిలపరచాలి — భావితరాలకు అందించాలి! స్వార్థచింతన వీడాలి — సమష్టి తత్వం అలవడాలి! అధికార దర్పం తగ్గాలి — అహంకారమంతా తొలగాలి! అవినీతి అక్రమాలు అంతమవ్వాలి — న్యాయధర్మాలు నిలవాలి! అనురాగ ఆత్మీయతలు వెల్లివిరియాలి — ఆదర్శ సమాజం ఆవిష్కృతం కావాలి! సేవలోనే సంతృప్తి చూడాలి — త్యాగంలోనే ఆనందం పొందాలి! తోటివారి ఉన్నతికి...
Image
 ఇంకేమి చేయాలో చెప్పవా! రాగాలు తీయనా — రాగమాలికలు పాడనా! గంధం పూయనా — గుబాళింపులు నింపనా! పువ్వులు విసరనా — పూలబాటలు వేయనా! నవ్వులు చిందనా — నవరసాలు పండించనా! అత్తరు చల్లనా — అందాలను చూపించనా! ముత్యాల హారాలు తేనా — ముచ్చటగా అలంకరించనా! మోములు వెలిగించనా — మురిపాలు పలికించనా! ఆనందాలు పంచనా — ఆత్మీయతను పెంచనా! వెన్నెలను దించనా — వన్నెల విందు చేయనా! విరజాజులు కోసుకురానా — విరుల జడలో తురుమనా! తేనెలను కురిపించనా — తీయని ఊసులు పలుకనా! చందమామను పిలవనా — చల్లని కబురులు చెప్పనా! మల్లెలను కోయనా — మాలలుగా అల్లనా! మధురిమలు నింపనా — మనసులను గెలుచుకోనా! సిరిమువ్వలు మోగించనా — సింగారాలు చేయనా! సిరులన్నీ కురిపించనా — చిరునవ్వులు పూయించనా! హృదయాన్ని తెరవనా — ఎదలోని ప్రేమను చాటనా! మనసున మనసును కలిపి — మమతల దీపాలు వెలిగించనా! మధురమైన ఈ అనుబంధానికి — మంగళహారతి పట్టనా! ఇంకేమి చేయాలో చెప్పవా — ఇంతకన్నా ఏం కావాలో చెప్పవా! గుండ్లపల్లి  రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం. 
Image
 కవితా పరిమళాలు! కవితలు మొలుస్తున్నాయి — కలల విత్తనాలై! కవితలు పూస్తున్నాయి — కలకాలపు పుష్పాలై! కవితలు కాస్తున్నాయి — కమ్మనైన ఫలాలై! కవితలు పిలుస్తున్నాయి — కవుల గుండె గొంతులై! కవితలు కడుపులు నింపుతున్నాయి — కవులకు జీవనాధారమై! కవితలు మనసులను దోచుతున్నాయి — మధురమైన భావాలై! కవితలు కన్నీటిని తుడుస్తున్నాయి — కరుణామయ హస్తాలై! కవితలు గాయాలను మాన్పుతున్నాయి — ఓదార్పునిచ్చే లేపనాలై! కవితలు నవ్వులు పూయిస్తున్నాయి — నవరసాల విందులై! కవితలు వెన్నుతట్టి లేపుతున్నాయి — నూతన ఆలోచనలై! కవితలు సమాజాన్ని కదిలిస్తున్నాయి — చైతన్యపు శంఖాలై! కవితలు చరిత్రను లిఖిస్తున్నాయి — తరతరాల సాక్ష్యాలై! కవితలు ప్రేమను పంచుతున్నాయి — అనురాగపు జల్లులై! కవితలు ఆశను పెంచుతున్నాయి — ఆత్మవిశ్వాస దీపాలై! కవితలు బంధాలను కలుపుతున్నాయి — అనుబంధపు వారధులై! కవితలు బ్రతుకును నడిపిస్తున్నాయి — బంగారు బాటలై! కవితలు అక్షరమాలలై అలరిస్తున్నాయి — అందమైన అలంకారాలై! కవితలు భావాలుగా పలుకుతున్నాయి — హృదయపు ప్రతిధ్వనులై! కవితలు లోకాన్ని ఏలుతున్నాయి — సాహితీ సామ్రాజ్యాలై! కవితలు కవులను నిలుపుతున్నాయి — కీర్తి కిరీటాలై! కవితలే కవులకు కలకా...
Image
 అనునిత్యం కలం కదలాల్సిందే! ఏదో ఒకటి చేయాలి — ఏదో ఒకటి రాయాలి! ఏదో ఒకటి పంపాలి — ఏదో ఒకటి ప్రచురించాలి! ఏదో ఒకటి చదివించాలి — అక్షరాలతో జీవించాలి! ఏదో ఒకటి పాడాలి — ఏదో ఒకటి వినిపించాలి! ఉదయాన్నే లేవగానే ఊహలకు పదును పెట్టాలి — ఉత్సాహంగా కొత్త భావాలకు ఊపిరి పోయాలి! కలం పట్టి కాగితంపై కవితను కురిపించాలి — కమ్మని కవితా కుసుమాలను లోకానికి పంచాలి! పత్రికల పుటలను పసండైనకవితలతో నింపాలి — పాఠకుల హృదయాలలో స్థానాన్ని సంపాదించాలి! సభలలో కవితలను సగర్వంగా వినిపించాలి — సహృదయుల చప్పట్లతో సంతోషాన్ని పొందాలి! నిన్నటి కవితకు నేడు కొత్త మెరుగులు దిద్దాలి — నేటి కవిత రేపటికి కొత్తదనం సంతరించుకోవాలి! రాయని భావాలు ఎన్నో రమ్మని పిలవాలి — రాసిన అక్షరాలు మరిన్ని రాయమని వెంటాడాలి! లేకపోతే పాఠకులు ఊరుకోరు — పలకరింపులు ఆగవు! పత్రికల ఫోన్లు మోగుతూనే ఉంటాయి — పిలుపులు తగ్గవు! అక్షరాలు వెంటబడతాయి — ఆలోచనలు నిదురపోవు! కవితలు రాయకుంటే మనసు కుదుటపడదు — కలం విశ్రమించదు! పాటలు పాడాలి — పరవశించి వినిపించాలి! పదిమందితో చదివించాలి — పాఠకులను ఆకట్టుకోవాలి! రచనలు పంపాలి — రసజ్ఞుల మన్ననలు పొందాలి! సృజనకు సరికొత్త సొబగులద్...
Image
 పొంగుల పరవళ్లు! పొయ్యిమీద పాలు పొంగితే శుభసూచకం — పల్లెల్లో పండుగలకు, గృహప్రవేశాలకు ఆరంభం! ప్రాయం పొంగితే మనసులో పరవశం — పడుచు హృదయాల్లో ప్రేమానురాగాల చిగురింత! నదులు పొంగితే పొలాలకు జలకళ — నవజీవన సిరులు చిందే పుడమితల్లి మురిపెం! వాగులు పొంగితే వనాలకు వన్నెలు — వసుధపై విరిసిపడతాయి పచ్చని సొగసులు! హృదులు పొంగితే అనురాగాల వెల్లువ — అనుబంధాల మధ్య ఆత్మీయతల కలయిక! ఆనందం పొంగితే పెదవులపై చిరునవ్వు — ఆప్యాయతలు పంచితే అంతులేని మధురానుభూతి! ఊహలు పొంగితే అద్భుతాల ఆవిష్కరణ — ఆలోచనలు సాగిస్తాయి సృజనాత్మక ప్రయాణం! కరుణ పొంగితే మానవత్వానికి ఆధారం — క్షమ పొంగితే శాంతికి సరికొత్త సౌధం! కవితలు పొంగితే అక్షరాలకు అభిషేకం — కవితా హృదయంలో భావాల మధురసంగమం! కలం నుంచి జాలువారే కమ్మని కావ్యాలు — పాఠకుల హృదయాలలో నిలిచే చిరస్మరణీయాలు! పొంగడంలోనూ ఉంది ఒక పరమార్థం — పొంగేది మంచికైతే జీవితమే సార్థకం! హద్దులు దాటిన పొంగులు తెచ్చు ప్రమాదం — మితిమీరని పొంగులే మనిషికి సౌభాగ్యం! గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.
Image
 మనుషుల తీరుతెన్నులు! ఎదుటివారి మనసులను నొప్పించి తిట్టేవాళ్ళని దూరం పెట్టాలి — ఎన్నో ఆశలతో ఈ లోకంలో పుట్టేవాళ్ళని ఆహ్వానించాలి! అధికార మదంతో అమాయకులను కొట్టేవాళ్ళని బహిష్కరించాలి — అవకాశం చూసుకొని అందినకాడికి దోచుకునేవాళ్ళని దారికి తేవాలి! కన్నవారి కోసం కడుపు కట్టుకొని పెట్టేవాళ్ళని గౌరవించాలి — కష్టాల కడలిలో కన్నీటిని తుడిచేవాళ్ళని గుర్తుంచుకోవాలి!  పక్కవారి ప్రగతిని చూసి అసూయతో గిట్టేవాళ్ళకు దూరంగా ఉండాలి — పరోపకార బుద్ధితో పదిమందికి తోడయ్యేవాళ్ళని వెన్నుతట్టి ప్రోత్సహించాలి! పగలతో పగబట్టి పంతాలు పట్టేవాళ్ళని మార్చాలి — ప్రేమతో పరుల హృదయాలలో మమతలు చాటేవాళ్ళని మెచ్చాలి! ఎవరు పుట్టినా ఒకనాడు గిట్టేవాళ్ళని తెలుసుకోవాలి — తప్పులు చేసేవాళ్ళని తప్పు తెలుసుకునేలా మార్చాలి!  తిట్టేవారిని కాదు, తలచుకునేలా బతికేవారిని తలకెత్తుకోవాలి — కొట్టేవారిని కాదు, కౌగిలించుకునే మనసున్నవారిని గుండెల్లో నిలుపుకోవాలి! పుట్టుకతో ఎవరూ గొప్పవారు కాలేరని గ్రహించాలి — ప్రవర్తనతోనే మనుషులు మహనీయులవుతారని చాటిచెప్పాలి! గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.
Image
 కవిత్వంతో... కొండలకు బాటలేసి అలవోకగా ఎక్కుతా — కనిపించని శిఖరాలను సునాయాసంగా చేరుతా! ఆకాశపు అంచులను ఆనందంగా తాకుతా — అంతరిక్షపు అందాలను ఆశ్చర్యంగా చూస్తా! గాలిలో విహరిస్తూ గగనాన్ని చుట్టేస్తా — మేఘాల ముంగిట ముచ్చట్లు సాగిస్తా! జాబిలమ్మ ఒడిలో జాజిపూలు జల్లుతా — వెన్నెల విందుల్లో వేడుకగా గడుపుతా! తారకల తళుకుల్లో తేలుతూ ఆడుతా — చుక్కలతో చెలిమిచేసి చిందులు వేస్తా! ధ్రువతార చెంతన దర్జాగా నిలుస్తా— సప్తర్షుల సన్నిధిలో సంభాషణలు సాగిస్తా! ఇంద్రలోక వీధుల్లో ఇష్టంగా తిరుగుతా — అప్సరసల నాట్యానికి ఆనందంగా మురుస్తా! నందనవనంలో నవరంగ పూలు కోస్తా — కల్పవృక్షం నీడలో కలల పంటను పండిస్తా! కైలాస పర్వతాన్ని కళ్లారా దర్శిస్తా — పరమశివుని సన్నిధిలో పరవశించి నిలుస్తా! గంగమ్మ జటాజూటంనుంచి జాలువారేజలాన్ని చూస్తా— నంది నాదాల మధ్య నాదబ్రహ్మను వింటా! వైకుంఠ వాకిళ్లను వినయంగా చేరుతా — శ్రీహరి పాదపద్మాల చెంత శిరసు వంచుతా! ఆదిశేషుని పాన్పుపై అనంతుని దర్శిస్తా — లక్ష్మీదేవి కరుణామృతం మనసారా గ్రోలుతా! కాలాన్ని వెనక్కి నడిపించి గతాన్ని చూస్తా — రేపటి తరాల భవితను ముందుగానే చదువుతా! సప్తసముద్రాలను సిరాతోనే దాటుతా — సృ...
Image
 అనుకున్నా!  అందమైన కవితనొకటి రాయాలని అనుకున్నా, చక్కనైన చెలికత్తెకు పంపాలని అనుకున్నా. చల్లనైన తెల్లనైన వెన్నెలలో చెలిని పిలిచి, చెంతచేరి చేయిపట్టి నడవాలని అనుకున్నా. పరిమళాలు చిందుతున్న పుష్పాలను కోసుకొచ్చి, మల్లెపూల మాలగుచ్చి ఇవ్వాలని అనుకున్నా. చిరునవ్వులు చిందిస్తూ సంతసమును కలిగిస్తూ,  ముచ్చటైన మాటలతో గడపాలని అనుకున్నా. తరుణి మనసు దోచుకొని వివాహమునకు సమ్మతించి,  తలనువంచి తాళికట్టి తేవాలని అనుకున్నా. మనసులోన రేగినట్టి కోరికలను సాధించగ,  కన్న కలలన్నీ నిజము చేయాలని అనుకున్నా. అక్షరాలు కూరుస్తూ సుపదాలను పేరుస్తూ, కవిరాజుగా జగమంత ఏలాలని అనుకున్నా. గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.
Image
 వాక్కుల విన్యాసాలు  కలం ఒకటి చెంతకు వచ్చింది — కమ్మని కవితను కానుకగా ఇచ్చింది! అక్షరాల అందాలను అద్దంలో చూపింది — ఆలోచనల మకరందం మనసుకు పంచింది! గళం ఒకటి గానమై పలికింది — గుండెలోని భావాలను పాటగా వినిపించింది! మధురమైన రాగంతో మైమరపించింది — మదిలో ఆనంద వీచికలను ప్రసరించింది! పత్రిక ఒకటి పొద్దున్నే ఇంటికొచ్చింది — పలుకరించి కవితతో పరవశింపజేసింది! పదాల పొందికను పరిచయం చేసింది — పఠనానందపు మధురిమను చేకూర్చింది! పుస్తకం ఒకటి ముందుకు వచ్చింది — పదిలమైన భావాల సంపదను అందించింది! అద్భుతమైన కవితల అమృతం చిలికించింది — అంతరంగంలో అనుభూతుల దీపం వెలిగించింది! కవి ఒకరు చెంతకు వచ్చారు — కవితా మాధుర్యాన్ని ఆస్వాదింపజేశారు! చక్కని భావాలతో అలరించారు — చిరస్మరణీయమైన అనుభూతులను మిగిలించారు! కలం కవితకు ప్రాణం పోస్తుంది — గళం గీతమై గుండెల్లో నిలుస్తుంది! పత్రిక సాహిత్యాన్ని పదిమందికి చేరుస్తుంది — పుస్తకం తరతరాలకు జ్ఞానాన్ని పంచుతుంది! కవి సృజనకు అక్షరమే ఆలంబనం — కవితా పఠనానికి భావమే ప్రాణధనం! కవిత వినడం ఒక మధురానుభవం — కవిత్వం ఆస్వాదించడం ఓ అపూర్వానందం! వాణీదేవి కవులను కరుణిస్తుంది — వీణానాదాలతో వీనుల వ...
Image
 దశను మార్చే దిశలు! దశదిశలు పరికించి మంచి దిశను ఎంచుకో — దూరదృష్టితో గమ్యాన్ని నిర్దేశించుకో! మంచి మార్గమేదో ఆలోచించి తెలుసుకో — ముందడుగులు వేస్తూ విజయాలను సాధించుకో! ఎటువైపు సాగాలో ఎరుకను పెంచుకో — ఎదురయ్యే ఆటంకాలను ఎదిరించి నడుచుకో! ఎంచుకున్న దిశపై ఏకాగ్రత నిలుపు — ఎన్ని అవాంతరాలొచ్చినా లక్ష్యాన్ని చేరుకో! గాలివాటానికి గమ్యదిశ మార్చుకోకు — తాత్కాలిక ప్రలోభాలకు తలవంచకు! పట్టు విడువక ప్రయాణాన్ని కొనసాగించు — పరిస్థితులను ఎదుర్కొని ప్రగతిని సాధించు! దిశలేని పయనం దారితప్పిన బాట — లక్ష్యంలేని జీవితం వ్యర్థమైన ఆట! సరైన దిశే విజయానికి తొలిమెట్టు — సంకల్పబలమే గెలుపునకు కొండంత అండ! సుదిశలో సాగితే దశ మారుతుంది — దశ మారితే విజయలక్ష్మి వరిస్తుంది! చిత్తశుద్ధితో చక్కని దిశలో పయనిస్తే — చిరకాల కీర్తి నీచెంతకు చేరుతుంది! గమ్యమే ధ్యేయంగా గమనాన్ని సాగించు — గగనపు అంచులను అందుకునేవరకు నడువు! ఆత్మవిశ్వాసమే ఆయుధంగా మలుచుకో — అవకాశాల నిచ్చెనలెక్కి ఉన్నత దశను అధిరోహించు! దిశ నీ ఆలోచనకు దిక్సూచి కావాలి — దశ నీ కృషికి ప్రతిఫలంగా నిలవాలి! నీ ప్రయాణం నవతరానికి మార్గదర్శి కావాలి — నీ జీవితం విజయాలకు చిరునా...
Image
 నిత్యపోరాటాలు! చీకటిపై వెలుగు సాగించే సమరం — చెడుపై మంచి చేసే ధర్మయుద్ధం! అన్యాయంపై న్యాయం ఎగరేసే బావుటా — అధర్మంపై ధర్మం చేసే తిరుగుబాటు! ధనిక బీదల మధ్య అంతరాల అగాధం — పేదరికం పెంచే అసమానతల విషాదం! కూడు గుడ్డ నీడ కోసం బడుగుల ఆరాటం — కనీస హక్కుల సాధనకు ప్రజా ఉద్యమం! ఆడా మగా మధ్య ఆధిపత్య వైరం — అహంకారాల మధ్య అంతులేని ఘర్షణం! అధికార ప్రతిపక్షాల రాజకీయ చదరంగం — పదవుల వ్యూహాలతో సాగే రణరంగం! దేవతల రాక్షసుల మధ్య భీకర సంగ్రామం — సత్యాసత్యాల నడుమ ధర్మాధర్మ ఘర్షణం! అమృతం కోసం సాగిన సాగర మథనం — దైవాసురుల గాథలో దాగిన తాత్త్విక సందేశం! దేశాల మధ్య సరిహద్దుల వివాదం — జాతుల మధ్య ఆధిపత్యపు ఆరాటం! కులమతాల పేరుతో కలహాల కల్లోలం — మానవ సంబంధాల్లో మమతల అంతర్ధానం! మనిషిలో ఆశ నిరాశల అంతర్మథనం — మనసులో ఆలోచనల నిరంతర ఘర్షణం! గెలుపోటముల మధ్య జీవిత పయనం — సంకల్ప బలమే విజయానికి సోపానం! సవాళ్లను ఎదుర్కొంటేనే ప్రగతి — అనుభవాల సానతోనే పరిణతి! ప్రతిఘటన విధ్వంసానికి దారికాకూడదు — విజయగర్వం మానవత్వాన్ని మింగకూడదు! చీకటి తెరలను  వెలుగులు చీల్చాలి — చెడును తరిమేయాలి మంచితనపు కిరణాలు తరిమేయాలి! అసమానతల స్థానంలో ...
Image
 వెలుగుల వీరంగాలు! వెలుగు చీకటిని తరిమేస్తుంది — విశ్వమంతా కాంతిని విరజిమ్ముతుంది! భయాల తెరలను తొలగిస్తుంది — బతుకుకు భరోసానిచ్చి ముందుకు నడిపిస్తుంది! వెలుగు దిగులును మాయంచేస్తుంది — దివ్యమైన చిరునవ్వును పూయిస్తుంది! నిరాశా నిశీధిని పారద్రోలుతుంది — నిండు ఆశల ఉదయాన్ని చూపిస్తుంది! వెలుగు లోకాన్ని పరిచయం చేస్తుంది — వింతవింత వర్ణాలను ఆవిష్కరిస్తుంది! వినూత్న ఆలోచనలను రేకెత్తిస్తుంది — విజ్ఞానపు ద్వారాలను తెరిపిస్తుంది! వెలుగు అజ్ఞానాన్ని అంతం చేస్తుంది — అంతరంగంలోని చైతన్యాన్ని మేల్కొలుపుతుంది! అక్షరాల అంతరార్థాన్ని ఆవిష్కరిస్తుంది — అనుభవాల అమృతాన్ని అందిస్తుంది! వెలుగు గమ్యాన్ని దర్శింపజేస్తుంది — లక్ష్యాన్ని చేరే మార్గాన్ని చూపిస్తుంది! అడుగడుగునా ఆత్మవిశ్వాసాన్నిస్తుంది — అవరోధాలను అధిగమించే శక్తినిస్తుంది! వెలుగు విజ్ఞానదీపాన్ని వెలిగిస్తుంది — వివేకపు వాకిళ్లను తెరుస్తుంది! వెలుగు ఉన్నచోట వికాసం విరబూస్తుంది — వెలుగు లేని చోట అజ్ఞానం తాండవిస్తుంది! వెలుగు ఒక దీపం — చీకటికి శాపం! వెలుగు ఒక జ్ఞానం — జీవితానికి ప్రాణం! వెలుగు ఒక మార్గం — విజయానికి సోపానం! వెలుగు ఒక ప్రేరణం — ప్ర...
Image
 జగజ్యోతులు! సూర్యుని కిరణాలు సృష్టికి వెలుగులు — చీకట్లను తరిమే దివ్య తేజాలు! చంద్రుని వెన్నెల మనసుకు హాయులు — మదులను మురిపించే మధుర భావాలు! దీపాల కాంతులు ఇంటికి శోభలు — జీవిత బాటలో ఆశల దీపాలు! తారల తళుకులు నింగికి అందాలు — కన్నుల విందుచేసే వజ్రాల మెరుపులు! మెరుపుల విద్యుల్లతలు మబ్బుల మాయలు — క్షణకాలంలో విరిసే కాంతి జ్వాలలు! మోముల నవ్వులు మనసుల మమతలు — మానవ జీవితాన వెలిగే వెన్నెలలు! ఉదయపు అరుణిమ ఉత్సాహ కిరణం — సంధ్యారాగం ప్రకృతి సౌందర్య గానం! పున్నమి జాబిలి ప్రేమకు ప్రతిరూపం — పసిపాప నవ్వు ఆనందానికి రూపం పరమానంద స్వరూపం! సూర్యకాంతిలో శక్తిని చూద్దాం — చంద్రవెన్నెలలో ప్రశాంతిని పొందుదాం! దీపపు వెలుగులో జ్ఞానాన్ని పెంచుకుందాం — చిరునవ్వుల వెలుగుతో ప్రేమను పంచుదాం! కాంతులెన్నున్నా కన్నులకు విందులే — కరుణ నిండిన హృదయాలు నిజమైన వెలుగులే! బాహ్య కాంతులన్నీ తాత్కాలికం —— అంతరంగ జ్యోతి అజరామరం! ప్రకృతిలోని కాంతులు ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తే, మనిషిలోని ప్రేమ, కరుణ, చిరునవ్వులు జీవితాలను వెలిగిస్తాయి! గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.