మహిళల్లో... 


మహిళల్లో అమాయకత్వం చూస్తున్నా —

మల్లెపువ్వులాంటి మనసును చూస్తున్నా!

మాటల్లోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నా —

మమతలు పంచే మాతృహృదయాన్ని చూస్తున్నా!


మహిళల్లో అందాన్ని చూస్తున్నా —

అనురాగాల అందాల మందిరాన్ని చూస్తున్నా!

చిరునవ్వుల వెన్నెలను ఆస్వాదిస్తున్నా —

చిలిపి సిగ్గుల ఎర్రని బుగ్గలను చూస్తున్నా!


మహిళల్లో అభిమానాన్ని చూస్తున్నా —

ఆప్యాయతల అమృతధారను చూస్తున్నా!

ఆపదలో ఆదుకునే ఆత్మీయతను చూస్తున్నా —

అలుపెరుగని అనుబంధాల అనురాగాన్ని చూస్తున్నా!


మహిళల్లో ప్రేమను చూస్తున్నా —

మమతలతో నిండిన హృదయాలను చూస్తున్నా!

ప్రియుల కోసం పరితపించే తత్త్వం చూస్తున్నా —

ప్రేమకే అర్థం చెప్పే త్యాగగుణాన్ని చూస్తున్నా!


మహిళల్లో ఏడుపును చూస్తున్నా —

ఎదలో దాగిన గాయాల సవ్వడిని వింటున్నా!

కన్నీటి చుక్కల్లో కరిగిపోయే కలలను చూస్తున్నా —

కడలి లోతుల్లో దాగిన వేదనలను చూస్తున్నా!


మహిళల్లో ఆందోళన చూస్తున్నా —

అనేక బాధ్యతల భారాన్ని చూస్తున్నా!

సామాజిక సంకెళ్లలో చిక్కిన జీవితాలను చూస్తున్నా —

స్వేచ్ఛగా విహరించాలనే స్వప్నాన్ని చూస్తున్నా!


మహిళల్లో మానవత్వం చూస్తున్నా —

మమతల మకరందం పంచే మహోన్నతత్వం చూస్తున్నా!

పరుల కష్టాలకు పరితపించే కరుణను చూస్తున్నా —

పరోపకారమే పరమధర్మమనే పవిత్రతను చూస్తున్నా!


మహిళల్లో పోరాట పటిమను చూస్తున్నా —

పరుగెత్తే కాలంతో పోటీ పడే శక్తిని చూస్తున్నా!

ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా ఎదిగే ధైర్యాన్ని చూస్తున్నా —

ఎదిగే తరాలకు దారిచూపే వెలుగును చూస్తున్నా!


మహిళల్లో దేవతను చూస్తున్నా —

దివ్యమైన ప్రేమకు చిరునామాను చూస్తున్నా!

జన్మనిచ్చే జననిని, జ్ఞానమిచ్చే గురువును చూస్తున్నా —

జగతిని నడిపించే జగన్మాతను చూస్తున్నా!


మహిళ నవ్వితే ఇంటిల్లిపాది వసంతం —

మహిళ ఎదిగితే సమాజానికే నూతన చైతన్యం!

మహిళకు గౌరవమే సమాజానికి అలంకారం —

మహిళా స్వావలంబనే దేశానికి సౌభాగ్యం!


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం. 



Comments

Popular posts from this blog