అక్షరాల ఆనంద నర్తనం
రవి ఉదయిస్తున్నాడు —
ఉర్విని మేల్కొలుపుతున్నాడు!
కవి కదం తొక్కుతున్నాడు —
చవుల్ని చిందిస్తున్నాడు!
జాబిలి జతను రమ్మంటుంది —
కౌముది కబుర్లు చెబుతానంటుంది!
చల్లని గాలి వీచుతున్నది —
చక్కని చెలి పిలుస్తున్నది!
మాటలు మురిపిస్తున్నాయి —
మనసును మైమరపిస్తున్నాయి!
పలుకులు ప్రేరణనిస్తున్నాయి —
ప్రతిభకు రెక్కలిస్తున్నాయి!
అక్షరాలు అల్లుకుంటున్నాయి —
అందమైన పదాలవుతున్నాయి!
ఊహలు ఊరుతున్నాయి —
ఉల్లాసభావాలు జనిస్తున్నాయి!
కరాలు కదులుతున్నాయి —
కలాలు కయితలు కూరుస్తున్నాయి!
కమ్మదనాలు కారుతున్నాయి —
కవితా కుసుమాలు విరుస్తున్నాయి!
గళాలు విప్పుకుంటున్నాయి —
గానామృతాలు కురిపిస్తున్నాయి!
కాగితాలు నిండిపోతున్నాయి —
కొత్త అర్థాలు స్ఫురిస్తున్నాయి!
పువ్వులు విరబూస్తున్నాయి —
నవ్వులు చిలకరిస్తున్నాయి!
పరిమళాలు వ్యాపిస్తున్నాయి —
హృదయాలు పులకిస్తున్నాయి!
పద్యాలు పసందును పంచుతున్నాయి —
గద్యాలు జ్ఞానాన్ని పెంచుతున్నాయి!
పాటలు పరవశింపజేస్తున్నాయి —
కవితలు కమ్మదనాన్ని పంచుతున్నాయి!
అందాలు అలరిస్తున్నాయి —
ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి!
ఊహలు రెక్కలు విప్పుతున్నాయి —
ప్రేమభావాలు చిగురిస్తున్నాయి!
వాగ్దేవి దీవెనలతో —
వాక్సుధలు జాలువారుతున్నాయి!
అక్షరాల ఆనంద నర్తనంతో —
అంతరంగాలు అలరారుతున్నాయి!
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

Comments
Post a Comment