మంగళూరు మహతోభార మంగళాదేవి మాతా!
వెండితేజస్సు విగ్రహమై
విశ్వశాంతిని ఒలికించే
కరుణామయి మంగళాదేవీ —
వేలవేల వందనాలు విశ్వమాతా!
నిత్యజ్యోతుల వెలుగులలో
అభయహస్తం విప్పి
అపాయాల అపహరించే తల్లీ —
పదివేల ప్రణామాలు ప్రసూతీ!
పుష్పహారాల పరిమళంలో
భక్తి బిందువులు జలజలలాడగా
వెండిముఖంలో మెరుస్తున్న
వాత్సల్య చంద్రకాంతివి నీవే అమ్మా!
మంగళనామమే మంత్రమై
మంగళూరుకు ప్రాణమై
శక్తి పీఠపు సింహాసనంపై
శాశ్వత శాంతిగా నిలిచినావు జననీ!
వివాహ విఘ్నాలు వీడి పోవగా
వంశవృద్ధి వసంతమవగా
దుఃఖదారులు మూసి వేసి
సుఖసోపానాలు విప్పే తల్లీ!
అమ్మా మంగళాదేవీ!
నీ వెండి స్వరూప దర్శనమే
నా కవితకు కాంతియై
నా జీవితానికి మంగళదీపమై—
నిత్యం నా అక్షరాలలో వెలుగవమ్మా దేవీ!
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment