అక్షరానుభూతులు


అక్షరాలు చూస్తే —

కళ్లల్లో దూరుతున్నాయి,

నిశ్శబ్ద నుదిటిపై

నక్షత్రాల్లా వెలుగుతాయి.


అక్షరాలు వస్తే —

హృదయానికి హరివిల్లై,

అనుభూతుల అంచులపై

అమృతబిందువులై చేరుతున్నాయి.


అక్షరాలు రాస్తే —

వేళ్లకు వేదన ఒక వరమై,

పుటలపై సిరిమువ్వలై

సంగీతపాఠాలు చెబుతున్నాయి.


అక్షరాలు చెబితే —

నోటి నిండా నెయ్యిలా,

అర్థాల అగ్నిలో

ఆలయ దీపాలవుతున్నాయి.


అక్షరాలు రాలితే —

కాలం కడలిలో

జ్ఞాపకాల ముత్యాలై

మౌనానికి అర్థం చెబుతున్నాయి.


అక్షరాలు వెళ్ళితే —

విడిపోతున్న వేళల్లో

మనసుని ముట్టే

వేదనగా మిగిలిపోతున్నాయి.


అక్షరాలు లేస్తే —

నిద్రలేని ఆలోచనలకు

ఉషస్సులై వచ్చి

ఆశలకు అద్దం పడుతున్నాయి.


అక్షరాలు తడితే —

భావాల వర్షంలో

పదాలు పరిమళించి

కవితగా పూస్తున్నాయి.


అక్షరాలు కురిస్తే —

చీకటి గుండెల్లో

వెలుగు నదులై

వేగంగా ప్రవహిస్తున్నాయి.


అక్షరాలు తోస్తే —

ప్రాణాల పడవను

అనంత తీరాలకు

అక్షయంగా నడిపిస్తున్నాయి.


అక్షరాలు -

హృదిని కదిలిస్తున్నాయి,

మదిని తొలుస్తున్నాయి,

జీవనసుధని కురిపిస్తున్నాయి.


అక్షరాలు -

కలమును పట్టిస్తున్నాయి,

ముందుకు నడిపిస్తున్నాయి,

కవనాలు వ్రాయిస్తున్నాయి.


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

Comments

Popular posts from this blog