అక్షరాలపై అయిదు ఆటవెలదులు


రాయ రాయ అక్షరాలు రత్నాలగు

చదువ చదువ బుద్ధి చాల పెరుగు

విద్య లేనివాడు వింతపశువగును

కన్నులుండికూడ కానకుండు


బ్రతుకు నిలువకుండు బంగారమున్నను

బుద్ధిలేనివాడు బూడిదగును

అక్షరాలుయున్న అన్నియు వశమగు

అవియు లేకయున్న అంధుడగును


మాటవంచనాల మాయలోన పడకు

పుస్తకాలతోడ నేస్తముచెయి

వదలకుండ విధిగ వాస్తవాలను చెప్పు

దాచినపుడు దారి దగ్ధమగును


చదువులేనివాడు సరసునందున కప్ప

నీటిలోనయుండి నెరపలేడు

అక్షరమను గొప్ప ఆయుధముండిన

మనుజడపుడు మంచి మానవుడగు


అక్షరములు అగును అమృతపుధారలు

కాలము గడచినను కరగకుండు

కవితలల్లినట్టి కవులకు కీర్తొచ్చు

సాహితీజగమున సతము నిలుచు


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.



Comments

Popular posts from this blog