నా దారి – అక్షరసుపథం
దారిని కనిపెట్టాలని ఉన్నది —
గమ్యం అనే కలను
అడుగుల ముందే నిలిపి
త్వరగా చేరవేయాలని ఉన్నది.
దారిని చూపాలని ఉన్నది —
చీకటి మలుపుల్లో
ధైర్యం అనే దీపాన్ని
మనసుల చేతుల్లో వెలిగించాలని ఉన్నది.
దారిని మలచాలని ఉన్నది —
తప్పుదోవల వంకరలను
సరైన దిశగా తిప్పి
నిశ్శబ్దంగా సరి చేయాలని ఉన్నది.
దారిని చెయ్యాలని ఉన్నది —
అలసిన అడుగులకు ఆశ్రయమై
ప్రయాణమే గురువయ్యేలా
జీవనానికి నిలకడ నేర్పాలని ఉన్నది.
దారిని పట్టించాలని ఉన్నది —
వంచనల వలల్ని విడదీసి
నిజానికి సూటి మార్గాన్ని
అడుగుల కింద పరచాలని ఉన్నది.
దారిని కాచాలని ఉన్నది —
నిద్రపోని కళ్లతో
దోపిడీ చేసే ఆలోచనల్ని
మొగ్గలోనే తుంచేయాలని ఉన్నది.
దారికి తేవాలని ఉన్నది —
జీవితపు చెల్లాచెదురు క్షణాల్ని
ఒక అర్థవంతమైన పథంగా
సరిదిద్దాలని ఉన్నది.
దారిని వెంబడించాలని ఉన్నది —
ముష్కరుల ఆటల్ని
సత్యపు వెలుగులో నిలబెట్టి
నిర్వీర్యం చేయాలని ఉన్నది.
అక్షరాల దారిన నడవాలని ఉన్నది —
మదిలో మరిగే భావాల్ని
మౌనాన్ని చీల్చి
పదాలుగా మలచాలని ఉన్నది.
కవితా దారిని పట్టాలని ఉన్నది —
కమ్మని అనుభూతుల్ని
లయలో కూర్చి
మనసులకు చేరవేయాలని ఉన్నది.
నా దారి
కేవలం రహదారి కాదు —
అది జీవితాన్ని సరిదిద్దే
అక్షరాల శాశ్వత మార్గం.
నా దారి
లక్ష్యాలను చేర్పించే సుపథం,
విజయాలను చేకూర్చే సన్మార్గం,
జీవితాలను గెలిపించే అక్షరాల సత్సంచారం.
—గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.
Comments
Post a Comment