నయానా? భయానా?
(సామదానభేదదండోపాయాలు)
అతిప్రేమను ఒలకబోసి
అంతరంగాలను అదుపులోకి తీసుకొని ఆటలాడించటం -
మంచిమాటల మల్లెలు చల్లి మనసులు గెలిచి
సొంత పనులు చక్కబెట్టుకోవటం — సామోపాయం.
బహుమతులు పంచిపెట్టి ప్రలోభాలకు గురిచేసి
బుద్ధిని బంధించి తనదారికి తిప్పుకోవటం —
ధనాన్ని ఇచ్చి కోరికలను నెరవేర్చి
తలలను వంచేలా చేసి ఆశయాలు సాధించటం - దానోపాయం.
సన్నిహితుల మధ్య అపార్ధాలు కలిగించి
అనుకున్న కార్యాలు సాధించటం –
బుద్ధిబలం ఉపయోగించి అంతఃకలహాలు రగిలించి
విధిలేని పరిస్థితులు సృష్టించి వశంచేసుకోవటం - భేదోపాయం.
అన్యగతిలేని సందర్భాలు కల్పించి
బలప్రయోగమైనా చేసి తలచినది నెరవేర్చుకోవటం -
హెచ్చరికలతో హింసతో హృదయాలను గడ్డకట్టించి
కత్తులు చూపి బెదిరించైనా కాళ్లదగ్గరకు తెచ్చుకోవటం - దండోపాయం.
సామమా, దానమా, భేదమా, దండమా —
ఏ దారిలో నడిచినా సాధించేది గమ్యమా?
మనిషిని మానవత్వాన్ని కోల్పోవడమా?
అడ్డదారులు తొక్కి అందుకునేది విజయమా? — నయానో… భయానో…?
చరిత్ర చివర అడుగుతుంది —
నీ అభిష్టం నెరవేరిందా?
నీ జీవితం నెగ్గిందా?
నీ సామ్రాజ్యం నిలిచిందా? — నయంతోనైనా… భయంతోనైనా…?
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

Comments
Post a Comment