కవితా ప్రయాణం
కవిత మదిలో మెరిసింది —
నిశ్శబ్దపు హృదయంలో
ఆలోచనల అలలా వచ్చి
భావాల్ని మేల్కొలిపింది.
కవిత కాగితపు ఒడిలోచేరింది —
సిరాతో స్నేహం చేసి
అక్షరాల అడుగుల్లో
అర్థాలకు ఊపిరి పోసింది.
కవిత నదిలా పారింది —
మనసు నిండా ప్రవహించి
పదాల పల్లకీలో
పుటలపై పరుగులేసింది.
కవిత కమ్మగా కుదిరింది —
అక్షరాల అల్లికలో
లయకు లయ కలిపి
స్వరాల్ని సర్దుకుంది.
కవిత పత్రికల్లో ప్రచురితమయ్యింది —
ప్రపంచపు వెలుతురులో
తన రూపాన్ని చూపిస్తూ
కవిత్వమని చాటింది.
కవిత పాఠకులను పిలిచింది —
హృదయాల తలుపులు తట్టి
“నన్ను ఆస్వాదించు” అంటూ
మనసులను పలకరించింది.
కవిత మన్ననలు పొందింది —
ప్రశంసల పరిమళంలో
చప్పట్ల మోగుల్లో
ఆనందంగా తేలిపోయింది.
కవిత కంచికి వెళ్ళింది —
కాలపు మడిలో ఒదిగి
సంతృప్తి నిద్రలో
శాంతిగా విశ్రాంతి తీసుకుంది.
కవితలను చదవండి —
కవులను ప్రోత్సహించండి,
పలుకులమ్మను తలచి
ప్రసాదంగా స్వీకరించండి.
కవితల్లో మునగండి —
కవితామృతమును త్రాగండి,
కవితావిందును ఆరగించి
కవితామర్మము తెలుసుకోండి.
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

Comments
Post a Comment