🌺 తెలుగు అక్షరాల జోరు 🌺
తెలుగు అక్షరాలు పువ్వులైతే —
తల్లి తలపై చల్లమను,
దండలుగా అల్లించి,
తెలుగు మాత మెడలో వెయ్యమను.
తెలుగు అక్షరాలు నవ్వులైతే —
మోములను వెలిగించి,
పెదాలను తెరిపించి,
తెలుగు వెలుగులు చల్లించు.
తెలుగు అక్షరాలు ముల్లులైతే —
వ్యతిరేకులను హెచ్చరించి,
వారి తీరును మార్చించి,
తెలుగు బాటను పట్టించు.
తెలుగు అక్షరాలు కర్రలైతే —
విన్యాసాలు చేయించి,
వినోదాలు అందించి,
తెలుగు కళలను ప్రదర్శించు.
తెలుగు అక్షరాలు నిప్పులైతే —
అవినీతి చీకట్లను కాల్చి,
ధర్మాన్ని నిలబెట్టి,
తెలుగు జ్యోతులై ప్రసరించు.
తెలుగు అక్షరాలు దీపాలైతే —
అజ్ఞాన అంధకారంలో వెలిగి,
బుద్ధి బాటలో నడిపించి,
తెలుగు ఖ్యాతిని వ్యాపించు.
తెలుగు అక్షరాలు రంగులైతే —
జీవిత చిత్రపటాలకి ప్రాణం పోసి,
నవరసాల సమ్మేళనంగా,
తెలుగోళ్ల మనసులు మురిపించు.
తెలుగు అక్షరాలు ఏరులైతే —
అనుభూతి కొండల నుంచి జారి,
భావ సాగరానికి చేరి,
తెలుగు కవితా స్రవంతిగా ప్రవహించు.
తెలుగు అక్షరాలు వెన్నెలైతే —
నేలపై జల్లుగా కురిసి,
కలల తోటలో
తెలుగు శాంతి కుసుమాలు పూయించు.
తెలుగు అక్షరాలు కవితలైతే —
అందాలు చూపించి,
ఆనందాలు పంచి,
తెలుగు ప్రేమికుల అంతరంగాలు దోచు.
✍️ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం ✍️

Comments
Post a Comment