భార్యాభర్తల బంధాలబలం


భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి —

మాటకంటే ముందు మనసు పలికేలా,

చూపుకంటే ముందు స్పర్శ తాకేలా,

నిశ్శబ్దమే సంభాషణ అయ్యేలా ఉండాలి.


అపురూపంగా ఉండాలి —

అలవాట్ల మధ్య ఆశ్చర్యం చల్లుకుంటూ,

పాత ప్రేమకు నూతన రంగులు అద్దుకుంటూ,

రోజూ ఒకరికొకరు కొత్తగా కనిపించేలా ఉండాలి.


ఆదర్శంగా ఉండాలి —

చూసేవాళ్ల కళ్లలో ఆశ నాటేలా,

విన్నవాళ్ల మాటల్లో ఉదాహరణగా,

బంధం అంటే బలమని చాటేలా ఉండాలి.


ఇరువురు ఒకటై ఉండాలి —

రెండు శ్వాసలు ఒకే తాళంలో నడిచేలా,

రెండు హృదయాలు ఒక లయలో స్పందించేలా,

నేను కాదు — మనం అన్న భావం నిండేలా ఉండాలి.


ఒకరికి ఒకరై ఉండాలి —

కష్టంలో కవచమై నిలబడుతూ,

సంతోషంలో పంచుకునే చిరునవ్వై,

అవసరమైతే నీడలా మారేలా ఉండాలి.


సీతారాములులా ఉండాలి —

త్యాగానికి అర్థం చెప్పిన ప్రేమగా,

నమ్మకానికి నిదర్శనమైన బంధంగా,

కాలాన్ని జయించిన కథలా ఉండాలి.


నీరుపాలులా కలిసి ఉండాలి —

వేరు చేయలేని సహజ సౌహార్ద్యంతో,

ఒకటి లేక ఒకటి అర్థం కాని విధంగా,

జీవితమే మధురమయ్యేలా ఉండాలి.


ఒకే మాటపై ఉండాలి —

సందేహాల్ని తలుపు దాటి పంపిస్తూ,

నిజాయితీని లోపల దీపంలా వెలిగిస్తూ,

విశ్వాసమే పునాది అయ్యేలా ఉండాలి.


ఒకే లక్ష్యంతో ఉండాలి —

రెండు కలలు ఒక దారిలో నడిచేలా,

రెండు అడుగులు ఒక బాటలో పడేలా,

భవిష్యత్తు పండుగగా మారేలా ఉండాలి.


హాయిగా కాలం గడపాలి —

వృద్ధాప్యమూ వసంతంలా అనిపించేలా,

చివరి శ్వాస వరకూ తోడుగా ఉండేలా,

ప్రేమనే జీవిత విజయంగా మలిచేలా ఉండాలి.


ఆలుమగలై ప్రేమ తాళం కట్టి,

అమ్మానాన్నలై బాధ్యత పాట పాడి,

అడుగుల లయలో పిల్లల కలలకు దారి వేసి,

జీవితం అనే సంగీతంలో బంధమే మధురరాగంలా ఉండాలి.


తాతానానమ్మలై దీవెనల స్వరం,

కొడుకుకోడళ్ళై నమ్మక నాదం, అల్లుల్లుకూతుర్లై బంధ విస్తారం,

పాత్రలు మారినా తాళం తప్పని ఈ ప్రయాణమే

కాలమంతా కొనసాగే దాంపత్య స్వరమేళనంలా ఉండాలి.


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

Comments

Popular posts from this blog