జీవితంలో....


నీకొక నెలవుండిన,

మనసు గుండెల్లో

వెండి వెలుగును జల్లుతూ

నిశ్శబ్ద సహచరుడై నిలుస్తుంది.


నీకొక తెరవుండిన,

ఆశల గాలిని

ఊపిరిగా నింపేలా

విశాలమైన ఆకాశాన్ని చూపిస్తుంది.


నీకొక తోడుండిన,

మాటలకన్నా ముందే

మనసు మాటను అర్థం చేసుకుని

భారాన్ని భయంగా కాదు — ధైర్యంగా మలచేస్తుంది.


నీకొక నీడుండిన,

ఎండల మధ్య కూడా

నీ అడుగులకు చల్లదనం పంచి 

నువ్వు ఎప్పుడూ ఒంటరివి కాదని గుర్తు చేస్తుంది.


నీకొక గురువుండిన,

తప్పులనే పాఠాలుగా మలచి

పతనాలకూ అర్థం చెప్పి

జీవిత పయనానికి నమ్మకమైన దిక్సూచి అవుతుంది.


నీకొక గమ్యముండిన,

అలసిన అడుగులకూ అర్థం దొరుకుతుంది,

ప్రతి రేపూ

ఒక నూతన ఉదయంగా నిన్ను పలకరిస్తుంది.


ఇవన్నీ నీకుంటే—

జీవితం భారం కాదు,

భరోసా అవుతుంది…

పోరాటం కాదు — పండుగ అవుతుంది.


— గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.



Comments

Popular posts from this blog