అట్టమీది ఆలేఖ్యము (పుస్తక ముఖచిత్రం)
అట్టమీది బొమ్మ అందంగా ఉండాలి—
చూపు తగిలిన క్షణాన
కళ్లలో చిరునవ్వు పూసేలా,
మౌనమే మాటలై మనసును పలకరించాలి.
అట్టమీది బొమ్మ ఆకట్టుకొనేలా ఉండాలి—
చూపును ఆపేసే వెలుగై,
చేతిని ముందుకు నడిపించే
అదృశ్య ఆహ్వానమై అట్టవద్దే ఆపనివ్వకుండాలి.
అట్టమీది బొమ్మ కవి ఉద్దేశ్యం చాటేలా ఉండాలి—
రంగుల మడతల్లో
భావాల దారి చూపుతూ,
గ్రంథ హృదయాన్ని ఒక చూపులోనే తెలియజేయాలి.
అట్టమీది బొమ్మ వెలుగుతున్నట్లు ఉండాలి—
దీపంలా కాదు,
అక్షరాల శ్వాసలా;
చదివించాలనే తపన కలిగించలి.
అట్టమీది బొమ్మ కొనిపించేలా ఉండాలి—
చేతిలోకి తీసుకునేలోపు
మనసులో చోటు చేసుకుని,
“ఇది నాదే” అన్న భావం నాటాలి.
అట్టమీది బొమ్మ చదివించేలా ఉండాలి—
ముందుమాటకు ముందే
ఆసక్తిని అల్లుకుని,
పుటలు తిప్పాలనే ఉత్సుకతను పెంచాలి.
అట్టమీది బొమ్మ మదుల్లో నిలిచేలా ఉండాలి—
చూసిన తరువాత కాదు,
మరిచే ప్రయత్నంలోనూ
గుర్తొచ్చేంతగా స్మృతుల్లో మోగించాలి.
అట్టమీది బొమ్మ అలంకారం —
కవితకు ముఖం,
గ్రంథానికి హృదయం,
పాఠకుడికి గాలం.
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

Comments
Post a Comment