ఊపుల ఊసులు
ఊయల ఊపితే —
చిన్ననాటి నవ్వులు గాలిలో జోలపాటలై,
కాలం తల్లడిల్లి
గతం మళ్ళీ ఒడిలోకి జారుతుంది.
చెట్టును ఊపితే —
కొమ్మల విసుర్లతో
ఆకుల చప్పట్లతో
గాలికీ ఒక భాష పుడుతుంది.
తలను ఊపితే —
అవునన్న అంగీకారమో,
కాదన్న నిరాకరణో,
మౌనమే మాటలై పలుకుతుంది.
చేతులు ఊపితే —
వీడ్కోలు కన్నీటిగా మారి,
స్వాగతం ఆశగా వికసించి,
దూరాలు దగ్గరవుతాయి.
జెండాను ఊపితే —
వీరుల రక్తస్మృతులు అలలై ఎగసి,
గుండెల్లో దేశం
జయజయ ధ్వనిగా మోగుతుంది.
బ్యాటును ఊపితే —
బంతి కాదు ఎగిరేది,
లక్షల కలలు,
గెలుపు గుబురుగా పూస్తుంది.
నడుము ఊపితే —
లయకు శరీరం నాట్యం చేస్తుంది,
అందం ఆడుతుంది,
ఆనందం వెల్లివిరుస్తుంది.
పైటకొంగు ఊపితే —
సిగ్గు చిరునవ్వు చింది,
సౌందర్యం మౌనంగా
హృదయాల్ని దోచుకుంటుంది.
తోకను ఊపితే —
నిజాయితీ గుర్తించక నేరగాడిగా ముద్ర వేస్తారు,
అవసరం తీరగానే తెగగొట్టి పడేస్తారు,
లాభం కోసం తన్ని తగలేస్తారు.
నోటును ఊపితే —
చెంతకు చేరి చెలిమిచేస్తారు,
మాటలతో మేనమామలు అవుతారు,
చేతులు కలిపి, సమయంచూచి చేటుచేస్తారు.
ఇవన్నీ ఊపులే —
కానీ ఒక్కో ఊపు జీవితానికి ఒక అర్థం,
హృదయానికి ఒక స్పందన,
మనసుకి ఒక ఉత్సవం.
ఊపులే లేకుంటే —
జీవితం నిశ్చల చిత్రం,
ఊపులున్నప్పుడే
మనుషులం… మనసులం… మాధుర్యాలం.
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

Comments
Post a Comment