అక్షరయానం
నుదిటిపై అక్షరాలు —
దేవుని విధిరాతలు,
నాలుకపై అక్షరాలు —
భావాలకు శ్రావ్యస్వరాలు.
నామకరణ రోజున బియ్యంపై రాసిన అక్షరాలు —
జీవితానికి తొలి చిరునామా,
అక్షరాభ్యాసంనాడు దిద్దిన బీజాక్షరాలు —
జ్ఞానానికి తెరిచిన తలుపులు.
పలకపై అక్షరాలు —
చిన్న చేతుల కలల గుర్తులు,
మట్టిపై అక్షరాలు —
చిన్నారుల సాధనకు తొలి చిహ్నాలు.
నీటిపై అక్షరాలు —
క్షణభంగుర సత్యాలు,
నోటుబుక్కుపై అక్షరాలు —
ఆశల్ని దాచుకున్న రహస్యాలు.
నల్లబోర్డుపై అక్షరాలు — గురువు చూపిన గీతల్లో
జీవితానికి దారి చెప్పే బుద్ధి బీజాలు.
ఇసుకపై అక్షరాలు — అలలొచ్చి చెరిపినా
మానస తీరాల్లో మిగిలిపోయే జ్ఞాపకాలు.
ప్రశ్నాపత్రాలపై అక్షరాలు — గుండెల్ని తడిపే
భయం–ధైర్యాల పరీక్షాకాలాలు.
సమాధానపేజీలపై అక్షరాలు — ఆలోచనల చెమటతో
సాధనకు ఫలమిచ్చే విజయ మార్గాలు.
లేఖపై అక్షరాలు —
దూరాల్ని దగ్గరచేసే ప్రేమ తార్కాణాలు,
పుస్తక పుటలపై అక్షరాలు —
తర తరాల్ని వెలిగించే దీపాలు.
శిలాఫలకంపై అక్షరాలు —
చెరపలేని శాశ్వత ఘనతలు,
సమాధిరాళ్లపై అక్షరాలు —
పెద్దలను గుర్తుకుతెచ్చే మాటలు.
పత్రికల్లో అక్షరాలు — సమాజ నాడిని పట్టే
నిజాల నిప్పులు, అబద్ధాల తెరలు.
టీవీల్లో అక్షరాలు — కళ్ల ముందే పరుగు తీసే
సమయానికి అద్దం పట్టే క్షణిక ప్రతిబింబాలు.
ఇలా… అక్షరాలు మనతోనే పుడతాయి,
మనతోనే పెరుగుతాయి,
మనసు చివరిపుట మూసేవరకు
మనల్ని మనతోనే చదివిస్తాయి.
అక్షరాలు —
మన ఊపిరి పలుకులు,
మన ఆలోచనల బాటలు,
మన భవిష్యత్తు వెలుగులు.
అక్షరాలను ప్రేమిద్దాం,
అర్థాలను గౌరవిద్దాం,
పదాలకు ప్రాణమిద్దాం,
మనసుల్ని వెలిగిద్దాం.
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

Comments
Post a Comment