చిరుభావాల చిరుచిట్టా


చిరునవ్వులు చిందుతా — 

మనసుల ముంగిట పూలవుతా,

మాటలకన్నా ముందే

హృదయాలను చేరుతా.


చిరువెన్నెల చల్లుతా —

నిశ్శబ్దానికి వెలుగవుతా,

చీకటి కళ్లకు

కలల దీపమవుతా.


చిరుగాలులు వీస్తా —

అలసిన ఊపిరికి ఊరటనిస్తా,

భారం మోసే హృదయానికి

సేద తీర్చుతా.


చిరుదివ్వెలు వెలిగిస్తా —

ఆశల అంచుల్ని తాకుతా,

చిన్న వెలుగే పెద్ద దారిని

చూపుతుందని చెబుతా.


చిరుజల్లులు చల్లుతా —

ఎండిన కలల్ని తడుపుతా,

చిన్నచిన్న బిందువులే

సముద్రమవుతాయని గుర్తుచేస్తా.


చిరుగజ్జెలు కట్టుకుంటా —

కాలంతో తాళం వేస్తా,

నడకలోనే లయను నింపి

నాట్యం చేస్తా.


చిరుపూజలు చేస్తా —

మనసే గర్భగుడిగా చేసుకొని,

నిజాయితీనే

నైవేద్యముగా అర్పించుకుంటా.


చిరుకోరికెలు కోరుతా —

అతి ఆశలు లేకుండా,

సంతృప్తే

సర్వస్వమని తెలుపుతా.


చిరుకోపాలు చూపుతా —

ప్రేమకు సరిహద్దులు గీస్తా,

మౌనమే

బోధకుడవుతుందని నేర్పుతా.


చిరుచివాట్లు పెడతా —

నోరును మూయిస్తా,

కాళ్లబేరానికి తెచ్చుకుంటా,

చెప్పినట్లు చేయించుకుంటా.


చిరుతగవులకు దిగుతా —

అలకపానుపు ఎక్కుతా,

బెదిరించి లొంగదీసుకుంటా,

చెప్పుచేతల్లో పెట్టుకుంటా.


చిరుకవితలు అల్లుతా —

ఈ చిన్నచిన్న క్షణాలతోనే,

జీవితం అనే

మహాకావ్యాన్ని కూర్చుతా.


చిరుక్షణాలు తలచుకో

చిరుప్రాయాన్ని గుర్తించుకో

చిరుమూటలు కట్టుకో

చిరుభావాలు వెల్లడించు.


చిరుచిట్కాలు పాటించు

చిరుకార్యాలు చేసెయ్యి

చిరువిజయాలు సాధించు

చిరుపతకాలు గెలుచుకో.


✍️ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog