జీవితం బంగారం


ఇల్లే బంగారం —

అమ్మ మమకారపు ముద్దుల గూడు

నాన్న నడకల నిశ్శబ్ద నిబంధన

గోడలమధ్య కాదు హృదయాలమధ్య నిలిచిన సంపద.


వళ్ళే బంగారం —

శ్రమ చిందిన చెమట చుక్కల్లో

కాలానికి ఎదురుగా నిలిచిన కాళ్లలో

వయసు ముద్రలు వేసినా విలువ తగ్గని జీవనరత్నం.


చూపులే బంగారం —

మాటలకన్నా ముందే పలికే భావాలు

నిశ్శబ్దంలోనూ అర్థం చెప్పే కళ్ల భాష

ఒక్క చూపుతోనే వెయ్యి వాక్యాలు వెలిగించే వెలుగు.


పలుకులే బంగారం —

పలకరింపులో పరిమళం

ఆశీర్వాదంలో అమృతం

గాయాన్ని మాన్పే మాట గుండెల్ని ముట్టే గంధం.


దొరికిన బంగారం —

అనుకోని వేళ అందిన స్నేహం

అవసరంలో దొరికిన ఆపన్నహస్తం

అదృష్టమని పిలిచినా దైవం పంపిన వరం.


దొంగ బంగారం —

మెరిసి మోసం చేసే ముఖాలు

బయట బంగారం… లోపల బూడిద

కనుల్ని మభ్యపెట్టినా మనసును కాల్చే నకిలీ కాంతి.


మనసే బంగారం —

క్షమించే గుణం ఉన్నప్పుడు

పంచే ప్రేమ పొంగినప్పుడు

కలుషం తాకని హృదయం కాలానికీ తరిగని ఖజానా.


అక్షరాలే బంగారం —

అనుభవం అరిగించిన అక్షరాలు

ఆలోచనకు ఆకారం ఇచ్చిన పదాలు

కవితగా కరిగిన భావం తరతరాలకు మిగిలే ధనం.


బంగారం తూకంతో కాదు —

బంధంతో కొలవాలి

మెరుపుతో కాదు —

మనసు వెలుగుతో తేల్చాలి


ఎందుకంటే…

మనిషే బంగారం

మనసుంటే… 

జీవితం బంగారం!


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

Comments

Popular posts from this blog