అక్షరాల ఆత్మనాదం


అక్షరాలు పలుకుతుంటే —

అంతరంగం ఆవిష్కృతమౌతుంది

మౌనపు మడులు విప్పి

మనసు ముత్యాలు జారుస్తుంది.


అక్షరాలు కలుసుకుంటే —

ఆలోచనలు అల్లికలౌతాయి

భావాల బాటల్లో

బంధాలు బలపడుతాయి.


అక్షరాలు నర్తిస్తే —

నాదాలు నూతనమౌతాయి

పదాల పరిమళంలో

ప్రపంచం పరవశిస్తుంది.


అక్షరాలు వెలిగితే —

అజ్ఞానం ఆవిరైపోతుంది

జ్ఞానదీపాల వెలుగులో

జీవితం జాజ్వల్యమౌతుంది.


అక్షరాలు పలికితే —

ప్రేమలు పరిమళిస్తాయి

పలుకుల్లో పరవశంగా

ప్రాణాలు పలకరిస్తాయి.


అక్షరాలు కదిలితే —

కాలమే కవితవుతుంది

గతం వర్తమానం మధ్య

గాథలు గుబాళిస్తాయి.


అక్షరాలు ఆవహిస్తే —

ఆత్మ సాక్షిగా మారుతుంది

నిజాల నడుమన

నిశ్చలమై నిలుస్తుంది.


అక్షరాలు నాలో నిండితే —

నేనే కవితనై వెలుగుతాను

పదాల ప్రవాహంలో

ప్రపంచాన్నే పులకరిస్తాను


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.


Comments

Popular posts from this blog