జయహే భారతమాత… 


మన భారతదేశం — మంగళమూర్తి నిలయం,

మన భారతదేశం — భక్తి భావాల బృందావనం॥


భగవంతుల ఆవాసమై భువిలో వెలిసిన పుణ్యక్షేత్రం,

భక్తజన హృదయాలలో భాసిల్లే దివ్యపవిత్రం,

ఘంటారావాల గర్భంలో గానం చేసే దైవస్వరూపం,

భూమాత ఒడిలో భాసురమై నిలిచే శుభమయధామం॥


స్వర్గసీమ సౌఖ్యమై సుమధుర భక్తి ప్రవాహం,

ఆశల అర్చనలతో అలరించే ఆనంద సాగరం,

పూజల పరిమళంలో పరవశించే పరమపావనం,

ప్రార్థనల పలుకుల్లో ప్రసరించే శాంతి సందేశం॥


గర్వగాథల గానమై గగనాన్నంటిన మహిమగానం,

చరిత్ర చైతన్యమై చిరకాలం వెలిగే దీప్తిగానం,

త్యాగతేజస్సు తారకమై త్రివర్ణ పతాక విహారం,

జాతిజ్యోతిగా జ్వలించే జయజయధ్వనులతో విరాజనం॥


సిరిసంపదల సింధువై సుగుణాల సౌభాగ్యనిలయం,

పచ్చని పంటల పాటలతో పరవశించే పల్లెగానం,

పట్టణ ప్రగతిపథంలో పలికే ప్రజల స్వప్నగానం,

సమృద్ధిసౌఖ్యాల సాక్షిగా సుగమజీవనానికి సిరిసంపదలధనం॥


ధర్మదీపమై దిక్కులన్నిటిని దారి చూపే మార్గం,

శాంతి సత్య సందేశమై జగమున వెలిగే సౌరభం,

సహన సౌహార్దాల సురభిలా సజీవ సాకారం,

విశ్వవేదికపై విరాజిల్లే విజ్ఞాన వీణా నాదం॥


భాషల భాస్కరమై భారతభాషల వెలుగు దీపం,

తియ్యనితేనెలొలికే తేటతనపు సాహిత్య గానం,

సంస్కృతి సుగంధాల సరస్వతీ స్రవంతి ప్రవాహం,

అక్షరార్చనల ఆలయమై ఆనంద విహార క్షేత్రం॥


మాతృమూర్తి మమతతో మలిచే మానవత్వ స్థావరం,

కన్నతల్లి కరుణగా కాపాడే కవచమై నిలిచే తావరం,

అన్నదమ్ముల అనుబంధం ఆవిష్కరించే ఆత్మబంధం,

ఐక్యతా మంత్రధ్వనితో అఖిల లోకాన్నే కట్టే బంధం॥


మన భారతదేశం — మంగళగానంగా మురిసే మధురరాగం,

సత్యం శివం సుందరమై సర్వలోకాలకు స్ఫూర్తి దీపం॥


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం. 


Comments

Popular posts from this blog