చూస్తున్నా..(గజల్)


ఉదయాన్నే నిద్రలేచి వెలుగుకోసం చూస్తున్నా

ఉషోదయపు కిరణంబుల వ్యాప్తికోసం చూస్తున్నా॥


నిశీధిలో తట్టినట్టి తలంపులను తలచితలచి

నవ్వులైన కొత్తదనపు రంగుకోసం చూస్తున్నా॥


గాలిలోన తేలియాడు సువాసనల గీతాల్లో

గుండెల్లో మ్రోగునట్టి స్వరంకోసం చూస్తున్నా॥


మబ్బుల్లో వెనుకనున్న నీలివర్ణ ఆకాశంలో

మనసులాను తాకేటట్టి క్షణంకోసం చూస్తున్నా॥


పూలచెట్ల పొదలలోన పరిమళాల పరవశాల

ప్రేమలోన పలకరించే స్పర్శకోసం చూస్తున్నా॥


నిశ్శబ్దపు లోకంలో నడుస్తున్న అడుగుల్లో

నిజంబుగా నిలిచిపోవు తోడుకోసం చూస్తున్నా॥


‘రాజేంద్రుని’ హృదయంలో కలలకడలి తీరంలో

కవితలుగా వికసించే భావంకోసం చూస్తున్నా॥


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.


Comments