అక్షరాలు లేకపోతే… (అక్షరమే ఆయుధం)


అక్షరాలు లేకపోతే —

నిశ్శబ్దమే నిత్యసహచరమౌతుంది

అక్షరాల అర్థాలులేని లోకంలో

అనుభవాలూ ఆవేదనలే మిగులుతాయి.


అక్షరాలు లేకపోతే —

ఆలోచనలు అణగిపోతాయి

మనసులో మాటలు ముడుచుకుని

మౌనమే మాటలుగా మారిపోతుంది.


అక్షరాలు లేకపోతే —

ప్రపంచపు పుటలన్నీ మూసుకుపోతాయి

జ్ఞానపు జ్యోతి దూరమైపోయి

జీవితం చీకటిలో మగ్గిపోతుంది.


అక్షరాలు లేకపోతే —

పిచ్చివారై అర్థాల్ని అల్లకల్లోలపరుస్తారు

తెలియని దారుల్లో తడబడుతూ

తప్పులనే సత్యాలుగా భావిస్తారు.


అక్షరాలు లేకపోతే —

అవకాశాల తలుపులు మూసుకుపోతాయి

ప్రగతి పథంలో అడుగులు జారిపడి

పరాజయాల పాలవుతారు.


అక్షరాల వెలుగైతే —

అంధకారమే పారిపోతుంది

జ్ఞానపు దీపం వెలిగితే

జీవితం జ్యోతిర్మయమవుతుంది.


అందుకే అక్షరమే ఆయుధం —

అక్షరమే ఆత్మస్వరూపం

అక్షరంతోనే ఎదుగుదల

అక్షరమే మనిషి మహోన్నతి.


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

Comments

Popular posts from this blog