అక్షర కామికా!
సాహితీ దీపాలు వెలిగించు—
దివ్యమైన దీప్తిని చిమ్మించు;
అక్షరాల ఆరాధనతో
అజ్ఞానాంధకారాన్ని అంతమొందించు॥
నవ్వులు చిందించు—
నిశ్శబ్దాల్లో నవనీతమై హృదయాలను తాకించు;
మాటల మధ్య మాధుర్యమై
మనసుల్ని మమతానురాగాలతో నింపించు॥
సూర్యోదయం కావించు—
ప్రభాతంలో ప్రతీ శ్వాసకు ప్రాణం పోయించు;
చిగురుటాకుల చప్పుడు లాగా
చిన్న ఆశల్ని చిగురించించు॥
జాబిలిని పొడిపించు—
వెన్నెలలో వెలుగుల వర్ణాలను విరజిమ్మించు;
నిశీధిలో నిశ్శబ్ద గీతమై
నిత్య సౌందర్యాన్ని నింపించు॥
అందాలు చూపించు—
అక్షరాల్లో అనుభూతుల అద్దమై నిలబెట్టు;
కవిత్వాన్ని కాన్వాసుగా మార్పించు
కలల చిత్రాలను ఆవిష్కరించు॥
ఆనందం కలిగించు—
పదాల్లో పలుకుల పూలవర్షం కురిపించు;
వేదనల వెన్నెల తొలగించి
వెలుగుల వైభవం పరిపించు॥
ప్రేమను పంచిపెట్టు—
హృదయాల్లో పలకరింతల పావురమై ఎగిరించు;
అక్షరాల ఆలింగనంలో
అనురాగాన్ని అమృతమై కరిగించు॥
కవితలను చదివించు—
లోకానికి కాంతిని చూపించు;
సాహిత్య వెలుగుల కిరణాలతో
సమస్త జగత్తుని ప్రకాశింపజేయించు॥
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

Comments
Post a Comment