బుద్ధి దారితప్పితే ...
బుద్ధి గడ్డితింటే—
గమనాల గూటిలో గాలివానలు దూసుకెళ్లగా
గమనికలన్నీ గాలికొదిలి
గరిక మొలకల మధ్య గుండె చప్పుడు మరిచిపోతుంది॥
బుద్ధి మొద్దుబారితే—
నిన్నటి నెమరులు నేడు నిశ్శబ్దమై
నిజాలన్నీ నిద్రలోనే నడుస్తుంటే
నవ్వులకే అర్థం అడగలేని దశలో నిలిచిపోతుంది॥
బుద్ధి మొండికేస్తే—
మార్పు తలుపు తట్టినా గుమ్మం తెరవని దృఢత
మాటల మడుగులో మునిగి
మనసే మలుపు తిరగని మూర్ఖత్వంగా మారిపోతుంది॥
బుద్ధి నిద్రపోతే—
జాగరణ గడియారాలు మోగినా వినని నిశ్చలత
జీవిత జ్యోతి మసకబారగా
జ్ఞానం జారిపడిన జాబిలిలా జారిపోతుంది॥
బుద్ధి ఎగిరిపోతే—
కల్పనల కిటికీ దాటి ఆకాశంలో కలిసిపోయి
కారణాలన్నీ కరిగిపోతే
కలలే కళ్లలో నిలిచిన గాలిపటమై తేలిపోతుంది॥
బుద్ధి మూగపోతే—
చైతన్యం చిగురించని చీకటి చెరలో
సత్యం సన్నగిల్లి సన్నని శ్వాసగా మారి
స్మృతుల సమాధిలో సద్దుచేయక పడుకుంటుంది॥
అయితే—
ఒక చినుకు చైతన్యం చాలు,
ఒక చిరునవ్వు చాలు,
ఒక చిగురు ఆశ చాలు జాగృతమవడానికి॥
అప్పుడు—
మళ్లీ బుద్ధి మేల్కొంటుంది,
మళ్లీ వెలుగులు వెలుగుతాయి,
మనసు మార్గం కనుగొని మళ్లీ మంచి దారిపడుతుంది॥
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

Comments
Post a Comment