నోరు జాగ్రత్త!
వ్యర్థ ప్రసంగాలు చెయ్యవద్దు—
వెలుగుల మాటలే వెలగాలి;
మౌనంలో మెరుస్తున్న సత్యము
మనసుల మధ్య మమతగా నిలవాలి॥
కూని రాగాలు తీయవద్దు—
కళలో కాంతి కరిగిపోకూడదు;
సత్యస్వరమే సుధగా పారాలి
సంగతుల సోయగం నిలవాలి॥
దొంగ మాటలు చెప్పవద్దు—
దారి తప్పించే దోపిడీ మాటలు;
నిజం నిలబెట్టే నిబద్ధతతో
నీతిగా సాగాలి అడుగులు॥
కల్లబొల్లి కబుర్లకు దిగవద్దు—
కలుషిత గాథలు కరిగిపోవాలి;
నిర్మలమైన నీతి కథలే
నిలువెత్తు నడవడిక కావాలి॥
ఎచ్చుల మాటలు వదరవద్దు—
ఎగసే అహంకార అగ్నిజ్వాలలు;
సాధుస్వభావపు చల్లని గాలి
సమతను సిరులా చిమ్మాలి॥
నోరు అదుపు తప్పవద్దు—
నోటి నుంచి నూలుపోగు మాటలు;
మనసుని మురిపించే మధురాలు
మాటల్లో మల్లెలై విరియాలి॥
కాకి గోల చేయవద్దు—
కలహాల కేకలు కరుగాలి;
కోకిల గానంలా కమ్మదనం
కంఠంలో కాంతిగా మిగలాలి॥
కుక్క అరుపులు కూయవద్దు—
కుటిల స్వరాలు తగ్గిపోవాలి;
కరుణ కిరణాల పలుకులతో
కాలమే కవిత్వమై మారాలి॥
గాడిద గాండ్రింపులు చేయవద్దు—
గాంభీర్య గళమే గౌరవం తెస్తుంది;
గొప్పదనం గోలలో కాదు,
గుణమున్న మాటల్లోనే గెలుపు ఉంటుంది॥
మాటలు మాణిక్యాలు అవ్వాలి—
మనసుల మధ్య మధురం కావాలి;
మాటలే మనుష్యుని ముద్ర కావాలి—
మాటల్లోనే మన మహిమ నిలవాలి॥
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

Comments
Post a Comment