వలల వలయం


డబ్బుల వలలో పడితే —

మనసు ముడుచుకుంటుంది

మానవత్వం మసకబారుతుంది

మూల్యాలు మట్టిపాలవుతాయి।


మాటల వలలో చిక్కితే —

మధురం మాయమవుతుంది

నిజం నీడవుతుంది

నమ్మకం నిశ్శబ్దమవుతుంది।


అందాల వలలో అడుగేస్తే —

అలజడి అలుముకుంటుంది

బాహ్య కాంతి మాయ చేస్తుంది

అంతరంగం ఆవేదన పడుతుంది।


ఆనందాల వలలో మునిగితే —

అతిగా అలవాటు అవుతుంది

తాత్కాలిక తేజస్సే మిగులుతుంది

శాశ్వత శాంతి దూరమవుతుంది।


చూపుల వలలో చిక్కితే —

చిత్తం చెల్లాచెదురవుతుంది

ఆశల అలలు లేపుతుంది

ఆటుపోట్లు తగులుతాయి।


వలపు వలలో ఇరుక్కుంటే —

వెలుగు వెన్నెలలా కనిపిస్తుంది

హృదయం కరిగిపోతుంది

వేదనల వర్షం కురుస్తుంది।


ఉచితాల వలలో లీనమైతే —

ఉన్నదాని విలువ కనుమరుగవుతుంది

ఉన్నతతనం దిగజారుతుంది

ఉద్యమమే విశ్వాసం కోల్పోతుంది।


రంగుల వలలో మునిగితే —

రంగులు రంజింపజేస్తాయి

నిజరంగు కనబడదు

జీవితం దారితప్పుతుంది।


వలల వలయంలో —

వివేకమే వైద్యం

విలువలే వెలుగులు

విశ్వాసమే విముక్తి మార్గం।


మనసే మిత్రమైతే —

ఏ వలయమూ బంధం కాదు

మనుగడే మంగళగానం ఆలపిస్తుంది

మనిషితనం మహోత్సవం అవుతుంది॥


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్,భాగ్యనగరం


Comments

Popular posts from this blog