గాయాలు నేర్పిన పాఠాలు


కష్టాలకు కూలిపోతాను అనుకున్నా —

కొండలా నిలబడటం నేర్చుకున్నా

కాలం కఠోరంగా కొట్టినా

కన్నీటి గుండెలో గర్వం పెంచుకున్నా।


కష్టాలకు కుమిలిపోతాను అనుకున్నా —

కన్నీటిని కవితగా మార్చుకున్నా

మనసు ముక్కలైన ప్రతి క్షణం తట్టుకున్నా

మౌనంలో మహోన్నత గాథ రాసుకున్నా।


కష్టాలకు కరిగిపోతాను అనుకున్నా —

వేదనలను  వెచ్చదనం చేసుకున్నా

అగ్నిలోనూ ఆత్మను నిలబెట్టటం నేర్చుకున్నా

దానిని ఆరనిదీపంలా మార్చటం తెలుసుకున్నా।


కష్టాలకు కుళ్ళిపోతా అనుకున్నా —

అవే నన్ను పుష్పింపజేశాయి

మట్టిలో పడి పోయిన గింజనైనా

మరలా మొలకెత్తే జీవమును అయ్యా।


కష్టాలు కరాళ రూపాలైనా —

కలలకి కంచె కట్టలేవు

మనసు మేల్కొంటే ప్రతి నొప్పీ

మహాసాగరమై మార్గం చూపించుతుంది।


కూలిపోను ఇక — నిలబడతాను

కుమిలిపోను ఇక — కవిత అవుతాను

కరిగిపోను ఇక — కాంతి అవుతాను

కుళ్ళిపోను ఇక — జీవం అవుతాను॥


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.


Comments

Popular posts from this blog