కవన తృష్ణ
కవనవీధిలో తిరగాలని ఉన్నది—
కలల కాంతుల వెంట కదలాలని ఉన్నది;
అక్షరాల అడుగుజాడల్లో
అంతరంగ స్వరాలు వినిపించాలని ఉన్నది॥
కవనరాజ్యము ఏలాలని ఉన్నది—
భావాల సింహాసనం అధిరోహించి;
పదాల పుష్పాలతో పండుగ చేస్తూ
ప్రపంచాన్ని పరిమళింపజేయాలని ఉన్నది॥
కవనసృష్టిని చేయాలని ఉన్నది—
కల్పనకు రెక్కలు కట్టి ఎగరాలని;
మౌనంలో మోగే సంగీతాన్ని
మాటలలో మలచాలని ఉన్నది॥
కవనకడలిలో ఈదాలని ఉన్నది—
కలతల కెరటాలను ఆలింగనం చేసుకుంటూ;
ఆలోచనల లోతుల్లో దాగిన
అమృత ముత్యాలను సేకరించాలని ఉన్నది॥
కవనాకాశంలో విహరించాలని ఉన్నది—
నక్షత్రాల నడుమ నవ్వుతూ సాగాలని;
వెన్నెలలో వాక్యాల వలయాలు వేసి
విశ్వాన్నే వేదికగా మార్చాలని ఉన్నది॥
కవనానందం పంచాలని ఉన్నది—
హృదయాల తలుపులు తట్టే హారతిలా;
చీకట్లలో చినుకులా జారి
చిరునవ్వులు చిగురించాలని ఉన్నది॥
కవనామృతమును త్రాగాలని ఉన్నది—
ప్రతి పాదంలో పరిమళం ఆస్వాదిస్తూ;
అక్షరాల ఆహ్లాదంలో మునిగి
ఆత్మను ఆనందింపజేయాలని ఉన్నది॥
కవనసేద్యము సాగించాలని ఉన్నది—
భూమిలా భావాలను జల్లుతూ;
కాలమే పంటగా మార్చి
కీర్తి ఫలాలను అందించాలని ఉన్నది॥
ఇదే నా కవన తృష్ణ—
అక్షరాల్లో జీవించాలనే ఆకాంక్ష!
పదాల్లో పవళించాలనే పేరాశ!
సాహిత్యంలో వెలిగిపోవాలనే తపన!
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

Comments
Post a Comment