ఆనంద నిలయాలు
ఆనందం —
ఇందుకలదా? అందుకలదా? అని
సందేహమే అవసరం లేదు;
ఎక్కడెక్కడ వెతికినా —
అందందులో విరజిమ్మేదే మహదానందం।
అదిగో ఆనందం —
మోముల్లో మెరిసే ముద్దు వెలుగు,
నవ్వుల్లో నిండే నిర్భర సంతోషం,
పువ్వుల్లో పరిమళించే పవిత్ర స్పర్శ,
చూపుల్లో చిలికే చినుకుల ప్రేమ।
అదిగో ఆనందం —
చేతల్లో చిగురించే సహాయం సుగంధం,
రాతల్లో రేగే హృదయ స్పందన,
మాటల్లో ముదురే మాధుర్యం,
మదుల్లో మురిసే మానస గీతం।
అదిగో ఆనందం —
పెదవుల పలకరింపులో పుడుతుంది,
పరుల పట్ల పరితపనలోనే పెరుగుతుంది,
సహజమైన స్నేహంలో సజీవమౌతుంది,
సహనంలో సార్థకతను సంతరించుకుంటుంది।
అదిగో ఆనందం —
బయట వెతికే బంగారం కాదు,
మనసులో ముద్రించే ముత్యం,
మనుగడలో మెరిసే మంగళ దీపం,
మనిషితనానికి మార్గదర్శి దీప్తి।
అదిగో ఆనందం —
అది ఎక్కడో కాదు…
మనలోనే ఉంది —
మనతోనే నడిచే సత్యం;
మనసు తెరిస్తే మెరిసే మహోత్సవం!
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

Comments
Post a Comment