భారత భాషల భూషణం – బంగారు తెలుగు


అచ్చ తెలుగు —

అమ్మ ఒడిలో జోలపాటై అలరించే భాష;

ఆత్మను ఆలింగనం చేసుకుంటూ

అమృతధారలు పారించే భాష॥


తేట తెలుగు —

తేటతెల్లమైన తాత్పర్యాలు పలికించే భాష;

తర్కానికీ తేనె పూసి,

తలపులకు వెలుగునిచ్చే భాష॥


తీపి తెలుగు —

తేనె చుక్కల తీయదనమై జారే భాష;

విన్న చెవులకు విందై,

మనసులకు మధురిమలు పంచే భాష॥


వరాల తెలుగు —

వాగ్దేవి వరమై వెలసిన భాష;

విద్యకు వెలుగై,

విజ్ఞానానికి వేదికైన భాష॥


పల్లె తెలుగు —

పంట పొలాల పరిమళం పంచే భాష;

గోదారమ్మ గలగలల్లో,

గోరింటాకు సొగసుల్లో వెలిగే భాష॥


నాజూకు తెలుగు — 

నవమల్లెల నాజూకుతనం నింపుకున్న భాష;

నవ్వులోనూ, నిట్టూర్పులోనూ

నయగారాన్ని నింపే భాష॥


సుందర తెలుగు —

సాహిత్య సరస్వతికి సింగారమైన భాష;

సంగీత స్వరాలకు సఖియై,

సంస్కృతికి సౌందర్యం చేకూర్చే భాష॥


నేటి తెలుగు —

నవయుగానికి నవచైతన్యం నింపే భాష;

నింగిని తాకే సాంకేతికతలోనూ,

నిత్యనూతనంగా నడిచే భాష॥


మేటి తెలుగు —

మహనీయుల మేధస్సుకు మణిహారమైన భాష;

మానవతకు మార్గదర్శకమై,

మహిమలను చాటే మేటి భాష॥


బంగారు తెలుగు —

భారత భాషల భూషణమై వెలిగే భాష;

భావాలకు బంగారు వన్నెలద్దే భాష;

భవితకు బాటలు వేసే భాష॥


తెలుగు మన సంస్కృతి, మన స్వరూపం,

తెలుగు తల్లి గుండె చప్పుడు, తండ్రి ఆశీస్సు;

తరతరాలకు తరగని తేజం, విశ్వ విరాజితం, 

భారత భాషల భూషణం మన తెలుగు బంగారం॥


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం. 



Comments

Popular posts from this blog