చిరుచింతనలు... చిరంతన సందేశాలు


చిరునవ్వులు చిందితే —

చీకటి మేఘాలు చెల్లాచెదరవుతాయి;

చిగురాకులు వేస్తే —

చెట్లన్నీ కొత్త జీవితాన్ని ఆహ్వానిస్తాయి॥


చిరుమొగ్గలు తొడిగితే —

చెలిమి సౌరభాలు వెదజల్లుతాయి;

చిరుజల్లులు పడితే —

చిట్లిన నేలలు చిగురాశలతో పులకరిస్తాయి॥


చిరుసవ్వడులు వినిపిస్తే —

చెవులలో చైతన్య వీణలు మ్రోగుతాయి;

చిరుమాటలు పలికితే —

చిరకాల బంధాలు మరింత బలపడతాయి॥


చిరుసాయం అందితే —

చిక్కుముడులన్నీ వీడిపోతాయి;

చిరుకోర్కెలు చిగురిస్తే —

చిత్తవీణలో ఆనంద రాగాలు పలుకుతాయి॥


చిరుతిండ్లు తింటే —

చిన్ననాటి మధుర జ్ఞాపకాలు మేల్కొంటాయి;

చిరునామా దొరికితే —

చేరాలనుకున్న గమ్యానికి దారులు  కనిపిస్తాయి॥


చిరుమోములు నవ్వితే —

చింతలన్నీ చిరుగాలిలో కలిసిపోతాయి;

చిరుగాలులు వీస్తే —

మేనులన్నీ మహదానందంలో మైమరచిపోతాయి॥


చిరుదీపాలు వెలిగితే —

చీకటి గుండెల్లో ఆశాజ్యోతులు వెలుగుతాయి;

చిరుపదాలు పేర్చితే —

చిరంతన సాహిత్య సౌధాలు నిర్మితమవుతాయి॥


చిరుభావాలు కురిస్తే —

చిత్తక్షేత్రంలో ప్రేమపూలు పూస్తుంటాయి;

చిరుకవితలు జాలువారితే —

చిరకాలం నిలిచే మనోమధుర గీతాలు పుడతాయి॥


చిరు అనే పదం చిన్నదే —

చైతన్యానికి చిహ్నమై నిలుస్తుంది;

చిరు అనే భావం చినుకే —

జీవితాన్ని ఆనందసాగరంగా మారుస్తుంది॥


చిరు చిరు మంచితనాలే —

మహోన్నత వ్యక్తిత్వాలకు పునాదులవుతాయి;

చిరు చిరు తేటతెలుగు కవితలే —

తెలుగు సాహిత్యానికి చిరకాల కీర్తిపతాకలవుతాయి॥


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.


Comments

Popular posts from this blog