చేతల చమత్కారాలు
త్రాగిస్తే —
తచ్చాడుతా, తాళాలకు తందనాలాడుతా;
తినిపిస్తే —
తిరుగుతా, తృప్తిని పొందుతా॥
పలకరిస్తే —
పలవరింతలై వికసిస్తా, పండుగవుతా;
పరవశపరిస్తే —
పట్టరాని తన్మయత్వంలో మునిగిపోతా॥
చూపిస్తే —
వెన్నెలై విరిసిపోతా, విస్మయమవుతా;
వినిపిస్తే —
వీణారాగమై విహరిస్తా, తన్మయుడనవుతా॥
ఆడిస్తే —
ఆనందిస్తా, ఆకట్టుకుంటా;
గెలిపిస్తే —
గంతులేస్తా, కీర్తిపతాకం ఎగరేస్తా॥
పాడిస్తే —
పంచమమవుతా, పాటలో ప్రాణమవుతా;
పొంగిస్తే —
పుష్కలానందమై పొంగిపోతా॥
ప్రేమిస్తే —
ప్రాణదీపమవుతా, ప్రణయసాగరంలో ఈదుతా;
పెళ్లిచేస్తే —
పాణిగ్రహణ బంధమవుతా, పరిపూర్ణ జీవితం గడుపుతా॥
రాయిస్తే —
రత్నాల్లాంటి భావాలు చిందిస్తా, రసవర్షమవుతా;
గీయిస్తే —
గవాక్షాలు తెరుస్తా, గీతల్లో గుండెచప్పుళ్లు నింపుతా॥
పొగిడితే —
పున్నమి చంద్రుడిలా ప్రకాశిస్తా, పుష్పంలా వికసిస్తా;
ప్రోత్సహిస్తే —
ప్రతిభను చాటుతా, ప్రగతి శిఖరాలెక్కుతా॥
నమ్మితే —
నింగంత విశ్వాసమై నిలుస్తా, నీడవుతా;
నడిపిస్తే —
నవ్యబాటల్లో పయనిస్తా, ఫలసిద్ధి పొందుతా॥
ఆదరిస్తే —
ఆత్మీయతై అల్లుకుపోతా, ఆనందమై నిలుస్తా;
ఆశీర్వదిస్తే —
అక్షరాల్లో చిరంజీవినై, అందరి హృదయాల్లో నిలిచిపోతా॥
— గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

Comments
Post a Comment