నీటి రూపాలు 


కన్నీరు — కరిగిన గుండెకు

కలిగే మూగసాక్ష్యం;

కంటి తలుపులు తెరిస్తే

కథలై జారే భావప్రవాహం॥


మున్నీరు — మహాసముద్రమై

మహిమను చాటే జలవైభవం;

లోతెరిగినవారికే

లోకసత్యాలు తెలిపే గురుబోధనం॥


తన్నీరు — దాహార్తిని తీర్చే

దైవానుగ్రహపు తీర్థం;

ప్రాణమనే మొక్కకు

ప్రతిరోజూ పోసే జీవజలం॥


తేనీరు — అలసటను కరిగించే

ఆప్యాయతల ఆహ్వానం;

ఒక కప్పులోనే

వంద పలకరింపులు నింపే స్నేహం॥


చన్నీరు — చికాకులను చల్లార్చే

చిరునవ్వుల నేస్తం;

వేసవి వేడిలో

వెన్నెలై దిగివచ్చే వరం॥


వెన్నీరు — వెచ్చని వాత్సల్యంతో

వేదనను వీడదీసే వైద్యం;

శరీరానికే కాదు,

మనసుకూ హాయినిచ్చే మమతామృతం॥


ఎలనీరు — ఎండల దాహానికి

ఎదురొడ్డి నిలిచే ప్రకృతి ప్రసాదం;

కొబ్బరి గుండెలో దాగిన

కల్పవృక్షపు కల్యాణామృతం॥


పన్నీరు — పూల పరిమళాలను

పుటపుటలుగా వెదజల్లే పవిత్రజలం;

పండుగలకు

పవిత్రతను పంచే పూల జలం॥


కన్నీరు కరుణను నేర్పింది,

మున్నీరు మహిమను చాటింది,

తన్నీరు ప్రాణాన్ని నిలిపింది,

తేనీరు స్నేహాన్ని పెంచింది.


చన్నీరు చల్లదనమిచ్చింది,

వెన్నీరు వెచ్చదనమిచ్చింది,

ఎలనీరు తృప్తిని నింపింది,

పన్నీరు పరిమళం పంచింది॥


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.


Comments

Popular posts from this blog