కావాలి స్వర్గం 


వెలుగు కావాలి —

వెలవెలబోయిన బ్రతుకుల్లో

వేకువ కిరణమై విరియడానికి;

చీకటి చాటున దాగిన చిరునవ్వులను మేల్కొల్పడానికి॥


వెన్నెల కావాలి —

వేదనల వేడిని చల్లార్చే

చల్లని చినుకులై కురవడానికి;

మనసు మడతల్లో దాగిన మధురస్వప్నాలను మేల్కొలపడానికి॥


ప్రేమ కావాలి —

ప్రాణానికి ప్రాణమై,

పలుకులకు పరవశమై;

హృదయాల మధ్య హరివిల్లుల వంతెన కట్టడానికి॥


మమత కావాలి —

మంచుతెరల మృదుత్వమై,

తల్లిచేతి స్పర్శై;

బాధలన్నిటినీ బుజ్జగించే జోలపాట కావడానికి॥


పువ్వులు కావాలి —

ప్రకృతి పెదవులపై

పూసిన నవ్వులై;

ప్రతి ఉదయాన్ని పండుగగా మార్చడానికి॥


పరిమళాలు కావాలి —

పూలలోనే కాదు,

పలకరింపుల్లోనూ పరచుకుని;

మనిషి మనసును మానవత్వంతో నింపడానికి॥


అందము కావాలి —

ముఖచందంలో కాదు,

మనసు మంచితనంలో;

చూపులను దాటి చిరకాల జ్ఞాపకాల్లో నిలిచిపోవడానికి॥


ఆనందము కావాలి —

ఆస్తుల్లో కాదు,

ఆప్యాయతల్లో విరియడానికి;

ఒక్కడికే కాదు, అందరి హృదయాల్లో అలలై పొంగడానికి॥


అందుకే... 

వెలుగు పంచే జీవితమూ, వెన్నెల చిందే మనసూ,

ప్రేమ పలికే పలుకులూ, మమత నింపే ముద్దులూ,

పువ్వులా నవ్వే ముఖాలూ, పరిమళాలై నిలిచే జ్ఞాపకాలూ,

అందమై వికసించే ఆత్మలూ, ఆనందంతో నిండిపోయే లోకమూ,

అదే మనిషి కలలుగనే నిజమైన స్వర్గం॥


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం. 



Comments

Popular posts from this blog