అన్నీ కుదరవు


అన్ని కూతలు

కోకిల గానాలు కావు;

అన్ని రాతలు

మహాకావ్యాలు కావు॥


అన్ని మబ్బులు

చినుకులు కురిపించవు;

అన్ని వృక్షాలు

ఫలప్రదాలు కావు॥


అన్ని మాటలు

మనసులను గెలుచుకోలేవు;

అన్ని ఊహలు

ఉన్నత శిఖరాలను చేరుకోలేవు॥


అన్ని అక్షరాలు

ఆణిముత్యాలు కావు;

అన్ని పదాలు

కవితలుగా వికసించవు॥


అన్ని ఆటలు

ఆనందాన్ని పంచలేవు;

అన్ని పాటలు

ఆత్మను తాకలేవు॥


అన్ని కలాలు

అద్భుతాలను సృష్టించలేవు;

అన్ని గళాలు

గుండెలను కదిలించలేవు॥


అన్ని నవ్వులు

మోములను వెలిగించలేవు;

అన్ని పువ్వులు

పరిమళాలను వెదజల్లలేవు॥


అన్ని కవితలు

కాలపరీక్షను గెలవలేవు;

అన్ని సాహితీసభలు

సాహిత్యాన్ని సుసంపన్నం చేయలేవు॥


గొప్పదనం

గోలలో కాదు—గుణంలో ఉంటుంది;

శాశ్వతత్వం

సంఖ్యలో కాదు—సారంలో ఉంటుంది॥


కాలమే

కళకు అసలైన గీటురాయి;

నిలిచేదే

నిజం నిండిన సృజన॥


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.



Comments

Popular posts from this blog