తెలియటంలా...


తెలియటంలా... ఎవరిని అనుసరించాలో

ఎవరికి దూరమై నిలవాలో,

వెలుగును చూపే చేతిని పట్టాలో

వెలుగును దాచే నీడను వదలాలో॥


తెలియటంలా...ఏమి మాట్లాడాలో

ఏమి మౌనంగా దాచుకోవాలో,

ఒక మాట మనసును గెలుస్తుందని

ఒక మాట మనిషిని దూరం చేస్తుందని॥


తెలియటంలా...ఏమి చేయాలో

ఏమి చేయకూడదో,

ఆవేశపు అలల వెంట పోవాలో

ఆలోచనల ఒడ్డున నిలవాలో॥


తెలియటంలా...ఎలా బతకాలో

ఎంతగా నవ్వాలో,

మన కోసం మాత్రమే జీవించాలో

మనతోపాటు మరొకరిని వెలిగించాలో॥


తెలియటంలా...ఎవరిని ప్రేమించాలో

ఎవరిని జ్ఞాపకాలుగా మిగల్చుకోవాలో,

కళ్లను ఆకట్టుకునే రూపాన్నా

హృదయాన్ని హత్తుకునే స్వభావాన్నా॥


తెలియటంలా...ఏమి చెప్పాలో

ఏమి గుండెలో దాచుకోవాలో,

అన్నీ చెప్పేస్తే విలువ తగ్గుతుందని

ఏమీ చెప్పకపోతే దూరం పెరుగుతుందని॥


తెలియటంలా... ఏమి చూడాలో

ఏమి చూడనట్టే వదిలేయాలో,

లోపాలను లెక్కించాలో

లోకాల్ని ప్రేమించాలో॥


తెలియటంలా... ఏమి రాయాలో

ఏమి రాయకూడదో,

కాలంతో కలిసి కరిగిపోయే అక్షరాలనా

కాలాన్నే నిలబెట్టే అక్షరాలనా॥


తెలియటంలా... జీవితం ఒక ప్రశ్నపత్రం,

జవాబులు మాత్రం పుస్తకాల్లో ఉండవు;

అడుగులు వేస్తూ నేర్చుకోవాలి,

అనుభవాలే గురువులవుతాయి॥


చివరికి తెలిసేదొక్కటే— నడక ధర్మం వైపుండాలి,

నమ్మకం మంచితనం వైపుండాలి;

ప్రేమ మనసులను కలపాలి,

రాత మనుషులను మేల్కొలపాలి॥


అప్పుడు తెలియకపోయిన దారులన్నీ

తామరతంపరలై తెరుచుకుంటాయి;

ప్రశ్నలతో మొదలైన జీవితం

ప్రకాశవంతమైన జవాబై నిలుస్తుంది॥


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం. 


Comments

Popular posts from this blog