పూల ప్రస్థానం


పూలు... పుట్టుకొస్తున్నాయి,

విచ్చుకుంటున్నాయి, పిలుస్తున్నాయి,

ప్రేమను పంచుతున్నాయి, పరిమళిస్తున్నాయి,

పొంకాలు చూపిస్తున్నాయి, పరవశపరుస్తున్నాయి॥


పూలు... వేకువ వెలుగులను

వెన్నెలలుగా మార్చుతున్నాయి,

గాలుల రెక్కలపై గంధ సందేశాలు పంపిస్తున్నాయి,

ప్రకృతికి రంగుల పండుగను ప్రతిరోజూ జరిపిస్తున్నాయి॥


పూలు... తేనెటీగలను ఆకర్షిస్తున్నాయి,

సీతాకోకచిలుకలను అలరిస్తున్నాయి,

కొమ్మలపై నవ్వుల జల్లులు కురిపిస్తున్నాయి,

తోటలలో రంగవల్లులు అల్లుతున్నాయి, 

భూమాతకు అందాల హారాలు అర్పిస్తున్నాయి॥


పూలు... పడతుల కొప్పులకెక్కుతున్నాయి,

పెళ్లిపందిరులను శోభాయమానం చేస్తున్నాయి,

దేవుళ్ల పాదపద్మాలను చేరుతున్నాయి,


దైవార్చనలకు దండలవుతున్నాయి,

భక్తి భావాలకు ప్రతీకలవుతున్నాయి॥


పూలు... కవుల్లో కవితా ప్రవాహాలు పారిస్తున్నాయి,

కలాల్లో రంగులు నింపుతున్నాయి,

కవిత్వంలో పదాలై వికసిస్తున్నాయి,

గేయాల్లో రాగాలై ప్రవహిస్తున్నాయి,

హృదయాల్లో భావసుమాలై నిలుస్తున్నాయి॥


పూలు... ప్రేమికుల సందేశాలవుతున్నాయి,

స్నేహితుల సంతోషాలవుతున్నాయి,

తల్లుల అనురాగాలవుతున్నాయి,

పిల్లల చిరునవ్వులవుతున్నాయి,

మానవత్వానికి మధుర చిహ్నాలవుతున్నాయి॥


పూలు... పుట్టి పరిమళిస్తున్నాయి,

పరిమళించి పరవశింపజేస్తున్నాయి,

పరవశింపజేసి పూజలందుకుంటున్నాయి,

పూజలందుకొని పరమాత్ముని చేరుతున్నాయి,

త్యాగమే జీవన సారమని తరతరాలకు బోధిస్తున్నాయి॥


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం. 


Comments

Popular posts from this blog